తెలంగాణలో అధికారం సాధించాలనే పట్టుదలతో ఉన్న కేంద్ర అధికార పార్టీ బిజెపి( BJP ) దానికనుగుణంగా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంతో పాటు, పార్టీ రాష్ట్ర నాయకులకు ఎప్పటికప్పుడు దీనిపై తగిన ఆదేశాలు జారీ చేస్తూ వస్తోంది.బిఆర్ఎస్( Brs ) ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా ఏ చిన్న అవకాశం దొరికినా, వదిలిపెట్టకుండా వాడేసుకోవాలని తెలంగాణ బిజెపి భావిస్తున్నా, నాయకులు మధ్య సమన్వయం లేకపోవడం, తీరికలేని షెడ్యూల్ కారణంగా కొన్ని కీలకమైన కార్యక్రమాలు వాయిదాల మీద వాయిదా పడుతూ గందరగోళంగా మారాయి.
తెలంగాణలో బిజెపి నిరుద్యోగ మార్చ్( Unemployment march ) పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం పై ఒత్తిడి పెంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.అయితే రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోనూ ఈ నిరుద్యోగ మార్చ్ నిరసన కార్యక్రమాలను చేపట్టాలని బిజెపి ముందుగా ప్లాన్ చేసుకున్నా, కేవలం రెండు జిల్లాల్లో మాత్రమే ఈ నిరుద్యోగ మార్చ్ జరిగింది.

కానీ మిగతా జిల్లాల్లో ఈ కార్యక్రమం జరగలేదు.దీనికి కారణాలు అనేకం ఉన్నాయి.టీఎస్పీఎస్సీ( TSPSC ) పేపర్ లీకేజీ వ్యవహారం పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, మంత్రి కేటీఆర్ ను భర్తరాఫ్ చేయాలని, నష్టపోయిన అభ్యర్థులకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బిజెపి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది.దీనిలో భాగంగానే ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో నిరుద్యోగ మార్చ్ నిర్వహించాలని ముందుగా నిర్ణయించుకున్నారు.
ఇది ప్రకటించి దాదాపు నెలరోజులు అవుతున్నా, ఇప్పటి వరకు రెండు జిల్లాల్లో మాత్రమే ఈ కార్యక్రమం జరిగింది.

మిగతా జిల్లాల్లో నాయకులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అంత ఆసక్తి చూపించకపోవడం , స్థానిక నాయకుల మధ్య అంత సమన్వయం లేకపోవడం, వరుస వరుసగా పార్టీ కార్యక్రమాలతో నాయకులు బిజీగా మారడం , మరి కొంతమంది నాయకులు ఈ కార్యక్రమం నిర్వహణ ఖర్చులు భరించేందుకు వెనకడుగు వేస్తూ ఉండడం, ఇంకోవైపు కర్ణాటక ఎన్నికల ప్రచారంలో తెలంగాణ బిజెపి కీలక నాయకులు అంతా పాల్గొంటూ, అక్కడ ఎన్నికలపైనే దృష్టి సారించడంతో నిరుద్యోగ మార్చ్ నిరసన కార్యక్రమాలు వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్నాయి.అయితే కర్ణాటక ఎన్నికలు తతంగం ముగిసిన తర్వాత ఈ కార్యక్రమాలు మొదలు పెడతామని బిజెపికి నాయకులు కొంతమంది చెబుతున్నా, ఎంతవరకు నెరవేరుస్తారు అనేది మాత్రం అందరికీ అనుమానంగానే ఉందట.







