అమెరికాలోని భారత కాన్సులేట్ కార్యాలయాలపై ఖలిస్తాన్( Khalistan ) వేర్పాటువాదుల దాడులు ఇరుదేశాల్లోనూ కలకలం రేపాయి.శాన్‌ఫ్రాన్సిస్కో( San Francisco ) నగరంలోని భారత కాన్సులేట్‌పై నెలల వ్యవధిలో జరిగిన రెండో దాడిని అమెరికన్ చట్టసభ సభ్యులు, భారతీయ కమ్యూనిటీ సంస్థలు ఖండించాయి.
ఈ ఘటనకు కారణమైన వారిని న్యాయస్థానం ముందు నిలబెట్టాలని వారు కోరారు.రాజ్యాంగం నిరసన తెలిపే హక్కును ప్రసాదించినప్పటికీ.
హింసకు పాల్పడే హక్కు ఎవరికీ లేదని ఇండో అమెరికన్ నేతలు వేర్వేరు ప్రకటనలు, ట్వీట్లలో పేర్కొన్నారు.అమెరికాలోని భారత రాయబారి తరంజిత్ సింగ్ సంధుతో సహా భారతీయ దౌత్యవేత్తలకు సిక్కు వేర్పాటువాదులు చేసిన బెదిరింపులను ఖండించారు.
ఈ పరిణామాల నేపథ్యంలో విదేశీ దౌత్యవేత్తలకు భద్రత కల్పించాలని బైడెన్( Biden ) పరిపాలనా యంత్రాంగాన్ని వారు కోరారు.
ఖలిస్తాన్ మద్ధతుదారులు జూలై 2వ తేదీన ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన వీడియోలో శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్‌పై దాడి, దానికి నిప్పంటించిన ఘటనను చూపింది.
హింస హింసనే ప్రేరేపిస్తుందనే పదాలతో కూడిన కామెంట్స్‌ను ఆ వీడియోలో పేర్కొన్నారు.ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ చీఫ్ హర్దీప్ సింగ్ నిజ్జర్( Hardeep Singh Nijjar ) హత్యకు సంబంధించిన వార్తా కథనాలను కూడా అందులో ప్రస్తావించారు.అతని తలపై రూ.10 లక్షల రివార్డ్‌తో పాటు కెనడా ప్రభుత్వానికి భారత్ ఇచ్చిన మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల జాబితాలోనూ నిజ్జర్ పేరు కూడా వుంది.
అమెరికా గడ్డపై వున్నప్పుడు విదేశీ దౌత్యవేత్తలు తమ ప్రాణాలకు భయపడాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ సభ్యుడు ఫ్రాంక్ పలోన్( Frank Pallone ) అన్నారు.హౌస్ ఫారిన్ అఫైర్స్ కమిటీ సభ్యుడు, కాంగ్రెస్ సభ్యుడు గ్రెగొరీ మీక్స్ ( Congressman Gregory Meeks )ఒక ట్వీట్‌లో ఇలా అన్నారు.నిరసన తెలిపిన హక్కు అందరికీ వుందని, దౌత్య సౌకర్యాలకు వ్యతికేరంగా హింసకు పాల్పడే హక్కు ఎవరికీ లేదన్నారు.పరస్పర గౌరవ మర్యాదలతో దౌత్యం వృద్ధి చెందుతుందని, అలాంటి హింసాత్మక చర్యలతో ఇది ఎప్పటికీ సహజీవనం కాదని మరో కాంగ్రెస్ సభ్యుడు జోనాథన్ జాక్సన్ అన్నారు.
ఇండియా కాకస్ సభ్యునిగా కాన్సులేట్ కార్యాలయంపై దాడిపై తక్షణం సమగ్ర విచారణ చేయాలనే ప్రతిపాదనకు తాను మద్ధతుగా వుంటానని జాక్సన్ స్పష్టం చేశారు.
మరోవైపు.ఖలిస్తాన్ వేర్పాటువాదుల ఆగడాలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ అప్రమత్తమైంది.అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, యూకే వంటి దేశాలకు సీరియస్‌గా సందేశం పంపింది.
ఖలిస్తాన్ అనుకూల గ్రూపులు భారతీయ దౌత్యవేత్తలకు బెదిరింపు పోస్టర్లు విడుదల చేశాయని పేర్కొంది.ఇలాంటి వ్యక్తలకు చోటివ్వరాదని, భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో హింసను సమర్ధించడం, ఉగ్రవాదాన్ని చట్టబద్ధం చేయడం సరికాదని విదేశాంగ శాఖ హెచ్చరించింది.
కాగా.ఈ ఏడాది మార్చిలో ఖలిస్తాన్ వేర్పాటువాద నేత, వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృత్‌పాల్ సింగ్ వ్యవహారం భారత్‌తో పాటు చాలా దేశాల్లో అలజడి రేపిన సంగతి తెలిసిందే.
ఇతనిని అరెస్ట్ చేయకుండా భారత ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు కొన్ని శక్తులు తీవ్రంగా ప్రయత్నించాయి.బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, అమెరికా తదితర దేశాల్లో స్థిరపడిన ఖలిస్తాన్ మద్ధతుదారులు భారతీయ దౌత్య కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని నిరసనలకు దిగారు.