అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్( Donald Trump ) బాధ్యతలు స్వీకరించిన తర్వాత అంతా భయపడ్డ అంశం ఇమ్మిగ్రేషన్.ట్రంప్ తొలిసారి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో తన కఠిన ఇమ్మిగ్రేషన్ నిబంధనలతో వలసదారులకు చుక్కలు చూపించారు.
ఈసారి కూడా ఇమ్మిగ్రేషన్ విషయంలో కఠినంగా ఉంటానని ఆయన ఎన్నికల ప్రచారంలోనే చెప్పారు.అందుకు తగినట్లుగానే దూకుడు నిర్ణయాలతో షాకులిస్తున్నారు ట్రంప్.
ఇప్పటికే అక్రమ వలసదారులను దేశం నుంచి బహిష్కరిస్తున్నారు.వీరిలో భారతీయులు కూడా ఉన్నారు.
తాజాగా విదేశీ వృత్తి నిపుణులను, కార్మికులను అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో పని చేసుకోవడానికి వీలు కల్పించే కీలకమైన హెచ్ 1 బీ వీసా( H1B Visa ) వ్యవస్థలో సమూల మార్పులకు డొనాల్డ్ ట్రంప్ శ్రీకారం చుట్టారు.మార్చి 20 నుంచి ఐదేళ్ల క్రితం నాటి పాత రికార్డులను తొలగించనున్నారు.
దీంతో సంబంధిత పాత వీసా డాక్యుమెంట్లను డౌన్‌లోడ్ చేసి పెట్టుకోవాలని అధికారులు సూచించారు.త్వరలోనే కొత్త దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో దరఖాస్తుదారులందరికీ మరింత పారదర్శకంగా సేవలందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని ట్రంప్ అధికార యంత్రాంగం స్పష్టం చేసింది.

దీనితో పాటు అమెరికాలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే విదేశీయుల కోసం మూడున్నర దశాబ్ధాలుగా అమల్లో ఉన్న వీసా విధానాన్ని మార్చాలని ట్రంప్ భావిస్తున్నారు.దీని స్థానంలో గోల్డ్ కార్డ్ వీసాలను తీసుకురానున్నట్లుగా ఇప్పటికే అధ్యక్షుడు సూత్రప్రాయంగా ప్రకటించారు.ఇలాంటి వారు అమెరికా పౌరసత్వం పొందేందుకు వీలు కుదురుతుందని ట్రంప్ చెప్పారు.దీని ప్రకారం అమెరికాలో 5 మిలియన్ డాలర్లు పెట్టుబడిగా పెట్టేవారికి గోల్డ్ కార్డ్‌లను( Gold cards ) మంజూరు చేయనున్నారు.
ఇలాంటి సంపన్నులు పన్నులు చెల్లించడంతో పాటు ఎంతో మందికి ఉపాధిని కల్పిస్తారని ట్రంప్ అభిప్రాయపడ్డారు.

ఈ గోల్డ్ కార్డు పేరును మార్చాలని ట్రంప్ భావిస్తున్నట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి.ఇటీవల ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.గోల్డ్ కార్డ్ కంటే ట్రంప్ కార్డ్ పేరుతోనే అది బాగా ఫేమస్ అవుతుందని ట్రంప్ చెప్పారు.
ఒకవేళ ఈ కార్డులను పొందిన వారు అర్హులు కాదని తెలిస్తే , వారి డబ్బును రిఫండ్ చేసి దేశం నుంచి బహిష్కరిస్తామని ఆయన క్లారిటీ ఇచ్చారు.