టెక్నాలజీని ఎవరు వాడినా వాడకపోయినా కేటుగాళ్లు మాత్రం చాలా బాగా వాడుతూ జనాలకు టోపీలు పెడుతున్నారు.ఇక తాజాగా కొందరు కేటుగాళ్లు ఈమధ్య సామాన్యులనే కాకుండా సెలబ్రిటీలకు కూడా టోకరా వేయాలని ప్రయత్నిస్తున్నారు.
గతంలో టిఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ కేకే ను టార్గెట్ చేసిన కేటుగాళ్లు ఈసారి రాయచోటిలో ఉన్న ఎమ్మెల్సీ జకియా ఖానమ్ ను టార్గెట్ చేశారు.చాకచక్యంగా వ్యవహరించిన ఎమ్మెల్సీ ఆ కేటుగాడి మోసాన్ని ముందుగానే తెలుసుకొని అతని పై కేసును నమోదు చేశారు.
ఇంతకీ ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
మంగళవారం రాయచోటిలో ఉన్న ఎమ్మెల్సీ జకియా ఖానమ్‌కి ఓ వ్యక్తి ఫోన్ చేసి తను సీఎం ఆఫీసులో ప్రాజెక్టు డైరెక్టరుగా పని చేస్తున్నానని తన పేరు బాబు జగ్జీవన్‌రావ్ అని ఎమ్మెల్సీకి పరిచయం చేసుకున్నాడు.
ఇక తను ప్రభుత్వం ఎమ్మెల్సీకి 25 లక్షలు లోన్ ఇవ్వడానికి ఆసక్తి చూపుతుందని దానికి ఆమె 50 వేల రూపాయలు డిపాజిట్ చేయవలసి ఉంటుందని ఆ 50 వేలను జగ్గారెడ్డి గూడెం బ్యాంక్ అకౌంట్ నంబర్ కు పంపించాలని కోరాడు.అతని వ్యవహారం పై అనుమానం వచ్చిన ఎమ్మెల్సీ వెంటనే ఈ విషయాన్ని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు.
ఈ విషయంపై ఆరా తీసిన శ్రీకాంత్ రెడ్డి అదంతా బోగస్ అని తేలడంతో ఈ అంశం పై కేసు నమోదు చేసి వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకోవాల్సిందిగా రాయచోటి అర్బన్ సీఐని ఆదేశించారు.