విడిపోయి అన్నదమ్ములుగా కలిసుందాం.అభివృద్ధిలో పోటీ పడదాం అనుకున్న తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు ఒకరు కోల్పోయిన అవకాశాన్ని మరొకరు అందిపుచ్చుకునే పనిలో ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రాష్ట్రం నుంచి వరుసగా ఒక్కొక్క సంస్థ వెనక్కి వెళ్లిపోవడం మనం చూస్తున్నాం.రాజధాని అమరావతిలో జరుగుతున్న పనులన్నింటినీ జగన్ సర్కార్ నిలిపేసింది.

రాజధానిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపిస్తూ ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.దీంతో మొదట్లో వరల్డ్ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్లాంటివి వెనక్కి వెళ్లిపోయాయి.ఈ మధ్యే సింగపూర్ కూడా రాజధాని ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే.గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఉన్నపుడు సింగపూర్ ప్రభుత్వం, అక్కడి సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నారు.

అమరావతి కోసం ఉచితంగా మాస్టర్ ప్లాన్‌ను కూడా వాళ్లు రూపొందించి ఇచ్చారు.ప్రధాన స్టార్టప్ ఏరియాను అభివృద్ధి చేయడానికి ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరింది.ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత కూడా ఈ ప్రాజెక్ట్‌లో కొనసాగడానికి సింగపూర్ ఆసక్తి చూపింది.అయితే జగన్ సర్కార్ నుంచి ఎలాంటి స్పందనా లేకపోవడంతో ఇక లాభం లేదనుకొని ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది.

అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్ వెళ్లిపోయింది.ఇలాంటి అవకాశాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వదలని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్.వెంటనే సింగపూర్ ప్రభుత్వం, సంస్థల ప్రతినిధులతో భేటీ అయ్యారు.ఐటీ, ఫార్మా, టూరిజంలాంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి సింగపూర్ ప్రతినిధులు ఆసక్తి చూపారు.దీనిపై కేటీఆర్ కూడా సానుకూలంగా స్పందించారు.అన్ని విధాలుగా ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్‌ను ఏర్పాటు చేయబోతోందని, దీనికోసం సింగపూర్‌కు చెందిన సుర్బాన జరాంగ్ మాస్టర్ ప్లాన్ ఇస్తోందని కేటీఆర్ వెల్లడించారు.మొత్తానికి ఏపీ వద్దనుకున్న సింగపూర్‌ను తెలంగాణ అక్కున చేర్చుకుంది.
నిజానికి ఇలాంటి పెట్టుబడుల అవసరం ఇప్పుడు తెలంగాణ కంటే ఏపీకే ఎక్కువగా ఉంది.కానీ దురదృష్టవశాత్తూ జగన్ సర్కార్ అలాంటి ఆలోచనలు చేయడం లేదు.