తెలంగాణ రాజకీయాల్లో తిరుగులేని నాయకులుగా ఉన్న కొండా కుటుంబం పై గత కొంత కాలం గా అనేక రాజకీయ విమర్శలు వస్తున్నాయి.సొంత పార్టీ నేతలే వారిపై బురద జల్లుతున్నారు.
కొండా కుటుంబం అంటే హడలిపోయే చోటా నాయకులు సైతం ఇప్పుడు ధిక్కార స్వరం వినిపిస్తుండడంతో వారి వెనుక టీఆర్ఎస్ అధిష్టానం ఉందని అందుకే వారు అంతగా రెచ్చిపోతున్నారు అనే అనుమానాలు కలుగుతున్నాయి.ముఖ్యంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి.
టీఆర్ఎస్ పార్టీలో రెండుమూడు వర్గాలుగా చీలిపోయింది.ప్రస్తుతం ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే కొండా సురేఖకు , వరంగల్ నగర మేయర్ నన్నపునేని నరేందర్ మధ్య కొంతకాలంగా మాటల యుద్ధం జరుగుతోంది.
ఇప్పటివరకు సైలెంట్ గా ఉన్న మేయర్ నరేందర్ కొండా సురేఖపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నాడు.తాను కూడా వచ్చే ఎన్నికల్లో టికెట్ రేసులో ఉన్నట్లు ప్రకటించారు.
అయితే, నరేందర్ దూకుడు వెనక పార్టీ అధిష్టానం అండదండలు ఉన్నాయనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.అందుకే మేయర్ నరేందర్ ఈ స్థాయిలో మాట్లాడుతున్నారనే అనుమానాలు అందరిలోనూ కలుగుతున్నాయి.
ఇప్పటికే వరంగల్ తూర్పులో కొండా సురేఖకు వ్యతిరేకంగా కొందరు నేతలు పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం వరంగల్ తూర్పులో ఎమ్మెల్యే కొండా సురేఖ, ఎమ్మెల్సీ కొండా మురళి దంపతులు ఒంటరి అయిపోయారనే టాక్ వినిపిస్తోంది.ఇదంతా కూడా పార్టీ అధిష్టానం కనుసన్నల్లోనే నడుస్తోందని పలువురు నాయకులు గుసగుసలాడుకుంటున్నారు.ఎమ్మెల్యే కొండా సురేఖ తన కూతురు సుష్మితను వచ్చే ఎన్నికల్లో భూపాలపల్లి నియోజకవర్గం నుంచి బరిలోకి దింపుతామని చాలాసార్లు చెప్పారు.
ఈ మేరకు ఆ నియోజకవర్గంలోనూ కొండా వర్గీయులు చురుగ్గానే పర్యటిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే ఆమె సిట్టింగ్ ఎమ్మెల్యే, స్పీకర్ మధుసూదనాచారిపై చేసిన వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపాయి.
స్పీకర్‌పై ప్రజల్లో వ్యతిరేకత ఉందనీ, పార్టీ అధిష్టానం ఆదేశిస్తే తన కూతురిని ఇక్కడి నుంచి పోటీ చేయిస్తానని ఆమె అన్నారు.దీనిపై పార్టీలో పెద్ద దుమారమే రేగింది.
ఒకవేళ తాము కోరుకున్నట్లు టికెట్లు ఇవ్వకపోతే.కొండా దంపతులు మళ్లీ కాంగ్రెస్ పార్టీకి వెళ్తారనే ప్రచారం జరుగుతోంది.
ఈ క్రమంలోనే వరంగల్ నగరమేయర్ నరేందర్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు.మీ ఇంట్లో మీరు మూడు టికెట్లు అడుగొచ్చుగానీ నేను ఒక్క టికెట్ అడిగితేనే తప్పా అంటూ ఆయన అనడం సంచలనం రేపాయి.
పార్టీ తమను పొమ్మనలేక పొగపెడుతుందనే విషయాన్ని వారు ఇప్పటికే గుర్తించారు.అందుకే ఇక టీఆర్ఎస్ తో అమీ తుమీ తేల్చుకునే పనిలో కొండా కుటుంబం ఉంది.తేడా వస్తే వారు మళ్ళీ కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది.వారు ఏ పార్టీలో ఉన్నా గెలుపు ఖాయం అనేది వారి ధీమా ఎందుకంటే…పరకాల, భూపాలపల్లి నియోజకవర్గాల్లో కొండా వర్గీయులు బలంగా ఉన్నారు.







