తెలంగాణ రాష్ట్రంలో మరో ఉప ఎన్నిక జరగనుంది.నాగార్జున సాగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మరణంతో ఉప ఎన్నిక అనివార్యం కానుంది.
దీంతో ఈ ఎన్నికలు కాంగ్రెస్, బిజెపిలకు మరో పరీక్షగా మారింది.అలాగే టీఆర్ఎస్‌కు కూడా.
ఇటీవల జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయఢంకా మోగించి టిఆర్ఎస్‌కు తామే ప్రత్యామ్నాయం అంటూ ఉవ్విళ్లూరుతున్న బిజెపి నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో తన సత్తా చాటుతుందా? లేదా? కమలం జోరు కేవలం దుబ్బాకకే పరిమితం కానుందా? అనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొన్నది.
ఈ స్థానంలో మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కె.జానారెడ్డికి మంచి పట్టు ఉన్నది.దీంతో తన స్థానాన్ని తిరిగి హస్తగతం చేసుకుని, రాష్ట్రంలో టిఆర్ఎస్‌కు తామే ప్రత్యామ్నాయం అనే వాతావరణాన్ని సృష్టించాలని, రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని దక్కించుకోవాలని జానారెడ్డి అనుకుంటున్నారు.
మరో వైపు సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు టిఆర్ఎస్ తీవ్ర ప్రయత్నాలు చేయనుంది.ఇది వరకు జరిగిన పొరపాట్లు, సమన్వయ లోపం ఈ ఉప ఎన్నికలో లేకుండా చూడాలని అధికార పార్టీ భావిస్తోంది.
ఇంకో వైపు బిజెపి నేతలు కూడా నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో మరోసారి తమ సత్తా చాటితే తెలంగాణ రాష్ట్రంలో ఇక కమలం బలానికి తిరుగు ఉండదనే సంకేతాలు ఇవ్వాలని యోచిస్తోంది.
చేజారకుండా జానా ప్రయత్నం…
నాగార్జున సాగర్ నియోజకవర్గం తన చేతి నుంచి చేజరిపోకుండా జానారెడ్డి వర్గం ఇప్పటి నంచే స్కేచ్ మొదలు పెట్టినట్లు తెలిసింది.2018 ఎన్నికల్లో సిట్టింగ్ ఎంఎల్ఎ జానారెడ్డి తన సమీప ప్రత్యార్థి నోముల నర్సింహయ్య చేతిలో సుమారు 7700 పై చిలుకు ఓట్లతో ఓటమి చెందారు.కాగా జానారెడ్డి ఓడిపోయినప్పటికీ 2014లో జరిగిన ఎన్నికల కంటే కూడా 2018 ఎన్నికల్లో ఆయనకు ఓట్లు ఎక్కువగా పోలయినప్పటికీ జానాకు ఓటమి తప్పలేదు.2014 ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే జానారెడ్డి చేతిలో టిఆర్ఎస్ నుంచి నోముల నర్సింహయ్య పోటీ చేసి ఓడిపోయారు.ఈ ఎన్నికల్లో జానారెడ్డికి 69,684 ఓట్లు పోలవ్వగా (42.72 శాతం) నోముల నర్సింహయ్యకు 52,208 (32.62 శాతం) ఓట్లు వచ్చాయి.టిడిపి నుంచి కడారి అంజయ్య యాదవ్‌కు 21,858 ఓట్లు పోలయ్యాయి.
ఆ తర్వాత జరిగిన 2018 ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి నోముల నర్సింహయ్య 83,655 (46.34శాతం) ఓట్లు పోలవ్వగా, కాంగ్రెస్ అభ్యర్థి కె.జానారెడ్డికి 75,884 ( 42.04శాతం) ఓట్లు పోలయ్యాయి.అలాగే బిజెపి అభ్యర్థిగా కనకాల నివేధితకు కేవలం 2675 (1.48శాతం) ఓట్లు మాత్రమే వచ్చాయి.దీంతో ఉప ఎన్నికల్లో తిరిగి జానారెడ్డి ఈ స్థానాన్ని కైవసం చేసుకంటారా? లేదా మళ్లీ టిఆర్ఎస్ తన సీటును దక్కించుకుంటుందా? బిజెపి బలం ఎంత అనేది త్వరలోనే తేలనుంది.