సూర్యాపేట:నీళ్లు,నిధులు, నియామకాలే లక్ష్యంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో యువత రోడ్లమీద ఉంటే కేసీఆర్ కుటుంబం బంగారు కుటుంబంగా తయారైందని,పేదలకు రేషన్ కార్డులు రావాలన్నా కేసీఆర్,బీఆర్ఎస్ పార్టీని ఓడించాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు అన్నారు.శనివారం ఆత్మకూర్(ఎస్) మండలం బొప్పారం గ్రామంలో బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ క్యాంపుకు ఆయన ముఖ్యాతిథిగా హాజరై మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ ద్వారా రెండు లక్షల రూపాయల ఆరోగ్య భీమా లభిస్తే,ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా ఐదు లక్షల రూపాయల ఆరోగ్య భీమా లభిస్తుందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించకపోవడంతో ప్రైవేట్ హాస్పిటల్ లో ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్సకు అనుమతించని పరిస్థితి ఉందన్నారు.ప్రభుత్వ ఉద్యోగులకు కూడా జీతాలు ఇవ్వలేని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య శ్రీ పథకాన్ని ఎత్తేసినా ఆశ్చర్యపోనవసరం లేదని ఎద్దేవా చేశారు.
అందుకే 1350 రకాల చికిత్సలకు దేశంలో అన్ని రకాల కార్పొరేట్ హాస్పిటల్ లలో ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా ఐదు లక్షల రూపాయల ఉచిత ఆరోగ్య భీమా లభిస్తుందని,ప్రజలందరూ వెంటనే ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ పథకంలో చేరాలని పిలుపునిచ్చారు.
కాలేశ్వరం ప్రాజెక్టు,మిషన్ భగీరథ,మిషన్ కాకతీయ పథకాలతో లక్షల కోట్ల రూపాయలను కేసీఆర్ కుటుంబం దోచుకుందని ఆరోపించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొమ్మిది సంవత్సరాలు పూర్తయినా ఇప్పటివరకు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయలేదని,కేసీఆర్ ను ముఖ్యమంత్రి పదవి నుంచి దించితేనే కొత్త రేషన్ కార్డులు వస్తాయని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు.టిఎస్పిఎస్సి పేపర్ లీకేజీలో రాష్ట్ర ప్రభుత్వం అసమర్థత ఉందని,ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేని ఈ అసమర్ధ ప్రభుత్వం ప్రజలకు అవసరమో కాదో ఆలోచన చేయాలని అన్నారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి 6వేల కోట్ల ఆదాయం వస్తే, ఇప్పుడు ఒక్క తెలంగాణలోనే మద్యం ద్వారా రూ.40వేల కోట్ల ఆదాయం వస్తుందని చెప్పారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను మద్యానికి బానిసలుగా చేసి కుటుంబ వ్యవస్థలను నాశనం చేస్తుందని ధ్వజమెత్తారు.వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ను ముఖ్యమంత్రి పదవి నుండి దించి వాళ్ల ఇంటికి పంపితేనే మన ఇంట్లో మనం ప్రశాంతంగా ఉండగలుగుతామన్నారు.
లేదంటే దోపిడి, అరాచకాలు,అక్రమాలు, హత్యలు,దౌర్జన్యాలు కొనసాగుతూనే ఉంటాయన్నారు.