గో ఆధారిత వ్యవసాయం, పంచగవ్య ఉత్పత్తుల తయారీ తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తామని, ఇందులో యువ రైతులు పాల్గొనేలా ప్రోత్సహిస్తామని టిటిడి ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి తెలిపారు.తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనం సమావేశ మందిరంలో ఆదివారం గోశాల నిర్వాహకులతో ఈఓ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ రాష్ట్రంలోని పలు గోశాలల్లో 2500 గోవులు మిగులుగా ఉన్నాయని, వీటిని జూన్ నెలలోగా అవసరమైన రైతులకు ఉచితంగా అందించేందుకు ప్రణాళికలు రూపొంది0చాలని ఈవో అన్నారు.నోడల్ గోశాలల్లో ఉన్న గోవుల ఆరోగ్యాన్ని పరీక్షించడం, గోవులకు అవసరమైన మేత, రైతులకు అందించేందుకు రవాణ ఛార్జీల కోసం ఆర్థిక సహాయం తదితర అంశాల పై చర్చించారు .తిరుపతిలో ఇటీవల నిర్వహించిన శిక్షణ కార్యక్రమం సత్ఫలితాలను ఇచ్చిందని గోశాల నిర్వాహకులు ఈఓకు తెలియజేశారు.శ్రీకాళహస్తిలోని గోశాలలో మే రెండో వారంలో శిక్షణ కార్యక్రమం జరుగనుందని వారు ఈఓకు తెలిపారు.
ప్రతి గోశాలలో ఒక్కో రకమైన నైపుణ్యం ఉందని, వాటిని ఉపయోగించుకొని చక్కటి పంచగవ్య ఉత్పత్తులు తయారు చేయవచ్చని వివరించారు.
ఈ సమావేశంలో తిరుపతి జెఈఓ శ్రీ వీరబ్రహ్మం, ఎఫ్ఎసిఎఓ శ్రీ బాలాజీ, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు, గోశాల డైరెక్టర్ డాక్టర్ హరనాథ్ రెడ్డి, ఆచార్య వెంకట నాయుడు, గోశాల నిర్వాహకులు శ్రీ శశిధర్, శ్రీ శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.