ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులని సరిగ్గా మూడేళ్ల క్రితం ఏపీ సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీలో ప్రకటించారు. ‘రాబోయే రెండేళ్లలో ఏపీకి మూడు రాజధానులు’ అందుబాటులోకి వస్తాయని సీఎం జగన్ అన్నారు.
కానీ న్యాయపరమైన వ్యాజ్యాలు, రాజకీయ సమస్యలతో రాజధాని అంశంపై అయోమయ పరిస్థితి నెలకొంది.తీవ్ర విమర్శలు వచ్చినా కూడా సీఎం జగన్ తన మూడు రాజధానుల ఆలోచనను అమలు చేసేందుకే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.
ప్రస్తుతానికి అధికార అమరావతి ఆంధ్ర ప్రదేశ్ రాజధానిగా ఉన్నప్పటికీ పరిపాలనను వైజాగ్‌కు మార్చాలని జగన్ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. అయితే మూడు రాజధానులు ప్రకటించినా గత మూడేళ్లలో సాధించిందేమీ లేదన్నది రాజకీయ విశ్లేషకుల ప్రధాన వాదన.
మూడు రాజధానుల వెనుక వైసీపీ అండర్ కరెంట్ రాజకీయ వ్యూహం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో సంక్షేమ పథకాలు తమను గెలిపిస్తాయని జగన్ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం భావిస్తుంది.
అలాగే మూడు రాజధానులను కూడా ఆయుధంగా చేసుకుని ఓట్లు సాధించిచాలని ప్రయత్నిస్తుంది. మూడు రాజధానులతో మూడు ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్న అజెండాను వైసీపీ ముందుకు తెచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
అందుకు తగ్గట్టుగానే వైసీపీ కర్నూలులో పెద్ద ఎత్తున బహిరంగ సభలు నిర్వహించగా, వైజాగ్‌లో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మూడు రాజధానుల చుట్టూ జరుగుతున్న రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే, ఈ ప్రకటనతో వైసీపీకి ఖచ్చితంగా ఏమీ లభించదని వారంటున్నారు.
వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ప్రజల విశ్వాసాన్ని చూరగొనాలంటే మంచి రాజకీయ వ్యూహాలు అవసరమంటున్నారు.