తెలంగాణలో బీజేపీ దూకుడు మీద ఉంది.దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలుపు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఊహించని విధంగా కార్పొరేటర్ సీట్లు గెలుచుకోవడంతో ఆ పార్టీకి తిరుగు ఉండదని.
ఆ పార్టీ నేతలు జబ్బలు చరుచుకుంటున్నారు.అయితే త్వరలో జరిగే మూడు ఎన్నికల్లో కాషాయం పార్టీకి షాక్ తప్పేలా లేదు.
మూడు చోట్లా కూడా ఆ పార్టీకి ఏ మాత్రం అవకాశాలు కనపడడం లేదు.త్వరలో నాగార్జునా సాగర్ ఉప ఎన్నిక జరగబోతోంది.
ఇక్కడ బీజేపీ గత ఎన్నికల్లో కేవలం 2 శాతం ఓట్లు సాధించింది.
ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడ టీఆర్ఎస్‌ను ఢీకొట్టేది కాంగ్రెస్ మాత్రమే అంటున్నారు.
ఈ లెక్కన సాగర్లో బీజేపీ ఓటమి తో పాటు డిపాజిట్ కూడా వచ్చే పరిస్థితి లేదు.ఇంకా చెప్పాలంటే సాగర్లో సరైన అభ్యర్ధి దొరకక బీజేపీ కిందా మీదా పడుతుంది.
ఇక రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో హైదరాబాద్ స్థానంలో ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు పార్టీలతో సంబంధం లేకుండా యువతలో పట్టు ఉంది.అక్కడ పీవీ కుమార్తె సురభివాణిని కేసీఆర్ బయటకు లాగినా పరిస్థితి అనుకూలంగా లేదంటున్నారు.
ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్సీగా రామచంద్రరావుకు గెలుపు అంత సులువు కాదు.ఈ స్థానంలో బీజేపీ ఆశలు వదులుకున్నట్లే.

ఇక నల్లగొండ – ఖమ్మం – వరంగల్ గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గంలో ప్రొఫెసర్ కోదండరామ్ పోటీలో ఉండడంతో అక్కడ పార్టీలకు అతీతంగా అందరూ ఆయన గెలుపు కోసం ఏకం అవుతున్నారు.ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా ప్రేమేందర్ రెడ్డి పోటీ లో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి రాములు నాయక్, టీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి పోటీ చేస్తున్నారు.ఇక్కడ కూడా బహుముఖ పోటీలో బీజేపీకి ఏ మాత్రం సీన్ లేదు.
ఈ మూడు జిల్లాల్లో అసలు బీజేపీకి పట్టే లేదు.ఏదేమైనా దుబ్బాక, గ్రేటర్ ఊపులో జోష్ మీదున్న బీజేపీకి ఈ మూడు చోట్ల ఘోరమైన ఓటమి తప్పేలా లేదు.