ఈ సంవత్సరం భారత క్రికెట్ జట్టు గురించి చెప్పుకోవడానికి ప్రత్యేకించి ఏమీ లేదని చెప్పుకోవాలి.ఆసియా కప్‌లో ఓడిన భారత్, ఆ తర్వాత T20 ప్రపంచకప్‌లో కూడా అనుకున్నంతగా రాణించక కప్పుని వదులుకోవాల్సి వచ్చింది.
దాంతో ఇండియన్ క్రికెట్ క్రీడాభిమానులు ఒకింత కలత చెందారు కానీ, ఒక విషయంలో మాత్రం కాస్త ఊరట చెందారు.అదేమంటే ప్రపంచం మొత్తం భారత బ్యాట్స్‌మెన్‌ను కొనియాడింది.అవును, కొన్ని ఇన్నింగ్స్‌లకు ప్రపంచం మొత్తం మన బ్యాటర్లకు సెల్యూట్ చేస్తోంది.2022 సంవత్సరంలో అలాంటి కొన్ని ఇన్నింగ్స్‌లు మన లిస్టులో వున్నాయి.
ఈ ఏడాది ఆరంభంలో కేప్‌టౌన్ టెస్టులో రిషబ్ పంత్ చేసిన బ్యాటింగ్ అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ గుర్తుండిపోతుంది.జనవరిలో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో పంత్ అజేయంగా 100 పరుగులు చేశాడు.
ఈ ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 4 సిక్సర్లు కొట్టాడు.పంత్ చేసిన ఈ సెంచరీకి ప్రపంచం మొత్తం సెల్యూట్ చేసిన సంగతి తెలిసినదే.
ఈ మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో ఓడిపోయినప్పటికీ పంత్ చేసిన సెంచరీ మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతుంది.అలాగే జులైలో నాటింగ్‌హామ్‌లో సూర్యకుమార్ యాదవ్ చేసిన సెంచరీ కూడా అతని అత్యుత్తమ ఇన్నింగ్స్‌గా పరిగణిస్తున్నారు నిపుణులు.

మూడవ T20లో ఇంగ్లండ్ 216 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా భారత్ 31 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది.ఆ తర్వాత బరిలో దిగిన సూర్య సంచలనం సృష్టించాడు.55 బంతుల్లో 117 పరుగులు చేసి అదరగొట్టాడు.ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏమంటే అతను తప్ప మరే బ్యాట్స్‌మెన్ కూడా 30కి మించి పరుగులు చేయలేకపోవడం.ఆ తరువాత విరాట్ కోహ్లీ గురించి మాట్లాడుకోవాలి.8 సెప్టెంబర్ 2022న అంటే సరిగ్గా 3 సంవత్సరాల అనంతరం అంతర్జాతీయ క్రికెట్‌లో కోహ్లీ సెంచరీ సాధించడం విశేషం.






