ఒకప్పుడు, అంటే దాదాపు ఒక దశాబ్దం కిందట పుట్టిన రోజు వేడుకలంటే చాలా అరుదుగా జరిగేవి.ఈ రోజుల్లో పెద్దలు పిల్లల పుట్టిన రోజు వేడుకలను చాలా ఘనంగా జరుపుతున్నారు.
ఇక మనుషులే కాకుండా మనోళ్లు చాలామంది కుక్కలకు కూడా జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించిన సందర్భాలూ వున్నాయి.కానీ పులి జన్మదిన వేడుకల్ని ఘనంగా చేయడం మీరు ఎప్పుడైనా చూశారా? పోనీ విన్నారా? దాదాపు లేదనే సమాధానం వస్తుంది కదూ.అవును, జాతీయ జంతువుగా చెప్పుకునే పులి( White tiger ) దగ్గరకు వెళ్ళడానికే చాలామంది భయపడుతూ వుంటారు.అలాంటి పులికి ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు విశాఖ జూ అధికారులు.

విశాఖ జూలో ఐదేళ్ల పులికి జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు అక్కడి అధికారులు.విశాఖలోని ఇందిరా గాంధీ ప్రదర్శనశాలలో ‘పీచెస్’ అనే తెల్లపులి( Peaches ) ఆగస్ట్ 13వ తేదికి ఐదేళ్లు పూర్తి చేసుకొని ఆరో ఏట దిగ్విజయంగా అడుగు పెట్టింది.దీంతో జన్మదిన వేడుకలు నిర్వహించాలని అనుకున్నారు జూ అధికారులు.తరువాత వీళ్లకు కళాశాల విద్యార్థులు కూడా తోడయ్యారు.అంతే వేడుకలు ఉత్సాహంగా, మరింత ఆనందంగా సాగాయి.ఆ ఐదేళ్ల తెల్లపులి “పీచెస్” ఉండే ఎన్ క్లోజర్ దగ్గర జరిగిన ఈ వేడుకలకు ప్రత్యేకంగా వైట్ టైగర్ థీమ్ కేక్‌ను తయారు చేయడం కొసమెరుపు.

క్యూరేటర్ డాక్టర్ నందని సలారియా( Nandani Salaria ) స్వయంగా కేక్ కట్ చేయడం గమనార్హం.వేడుకలకు ప్రత్యేక అతిధులుగా హాజరైన విద్యార్థులందరూ తమ ముఖానికి వైట్ టైగర్ మాస్క్‌లు ధరించి పీచెస్‌కు జన్మదిన శుభాకాంక్షలు చెప్పగా అక్కడి వాతావరణం చాలా ఆహ్లాదంగా మారింది.వైట్ టైగర్ పీచెస్‌ను మరింత జాగ్రత్తగా చూసుకునేందుకు, దాని సంక్షేమానికి దోహదపడేందుకు CPE జూనియర్ కాలేజ్ ముందుకు రావడం హర్షణీయం.సవ్యప్రాణుల సంరక్షణ పట్ల వారి అంకిత భావానికి నిదర్శనంగా కళాశాల యాజమాన్యం ఒక నెల పాటు పీచెస్ ను దత్తత తీసుకుంది.







