యాదాద్రి భువనగిరి జిల్లా:ముఖ్యమంత్రి కేసీఆర్ రెడ్డీలను నమ్ముకొని పనిచేస్తున్నారని,భవిష్యత్తులో రెడ్డీలు కలిసి కేసీఆర్ ను బొంద పెడతారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు.చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మునుగోడు ఉప ఎన్నికల బరిలో ప్రధాన పార్టీలన్ని రెడ్డీలకు టికెట్లు ఇస్తూ 90శాతం ఉన్న బహుజనులు అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇన్చార్జిల పేరిట ఎమ్మెల్యేలను మునుగోడు నియోజకవర్గంలో దించడంతో ఆయా నియోజకవర్గాల అభివృద్ధి కుంటుపడుతుందని అన్నారు.తెలంగాణలోని బహుజనుల అంతా ఏకమై తిరగబడితే నేపాల్ తరహాలో నాయకులు విమానం ఎక్కి పారిపోతారన్నారు.
ఓడిపోయే పార్టీ అయిన కాంగ్రెస్ సైతం రెడ్డీలకు టికెట్ ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు.మునుగోడు ఉప ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ పని అయిపోతుందని జోస్యం చెప్పారు.
ఆదివారం జరిగే సమావేశంలో తమ పార్టీ మునుగోడు ఉప ఎన్నికల బరిలో నిలిచేది,లేనిది చెప్తామని అన్నారు.ఈ సమావేశంలో బండిగారి వెంకట్,ఆదిమూలం శంకర్,వీరమల్ల కార్తీక్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.







