అద్దె చెల్లించడం లేదని ఆగ్రహంతో షాప్ లోని సామాగ్రికి నిప్పు పెట్టిన యజమాని చివరికి ఆ మంటల్లోనే చిక్కుకొని సజీవ దహనమైన ఘటన ప్రకాశం జిల్లా లోని దర్శిలో చోటుచేసుకుంది.ఈ ఘటనతో దర్శిలో విషాదఛాయలు అలుముకున్నాయి.
అసలు ఏం జరిగిందో అనే వివరాలు చూద్దాం.ఈ ఘటనపై దర్శి ఎస్సై రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.
దర్శి పట్టణంలోని కోతమిషన్ బజారులో పోతంశెట్టి వరప్రసాద్( Pothamshetty Varaprasad ) (45) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు.ఇతను కురిచేడు రోడ్డులో బంగారు దుకాణం నడుపుతున్నాడు.
అదే ప్రాంతంలో వరప్రసాద్ కు ఉండే షాపును శ్రీనివాసులు( Srinivas ) అనే వ్యక్తికి షామియానా వస్తువులు పెట్టుకునేందుకు అద్దెకు ఇచ్చాడు.
శ్రీనివాసులు 2020 నుంచి అద్దె చెల్లించకుండా, షాప్ ఖాళీ చేయకుండా, వరప్రసాద్ కు సరైన సమాధానం ఇవ్వకుండా ఉండడంతో వరప్రసాద్, శ్రీనివాసులు పై కోపాన్ని పెంచుకున్నాడు.
ఎన్ని ప్రయత్నాలు చేసినా శ్రీనివాసులు షాప్ ఖాళీ చేయాడని భావించిన వరప్రసాద్ షాప్ లోని సామాగ్రికి నిప్పు పెట్టాలని అనుకున్నాడు.ఆదివారం తెల్లారుజామున 5:30 గంటల సమయంలో షాప్ వద్దకు వెళ్లాడు.షాప్ కు తాళం వేయకుండా షట్టర్ అలాగే తెరిచి ఉంది.వెంటనే లోపలికి ప్రవేశించి అక్కడ ఉండే సామాగ్రిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు.
అయితే ఆ మంటలు క్షణాల్లో షాప్ అంతా వ్యాపించడంతో వరప్రసాద్ ఆ మంటల్లో చిక్కుకొని కేకలు పెట్టాడు.ఆ కేకలకు చుట్టుపక్కల వారంతా వచ్చి వరప్రసాద్ ను బయటకు తీయగా అప్పటికే 80 శాతానికి పైగా కాలిపోయాడు.
వెంటనే 108 కు కాల్ చేసి దర్శి సామాజిక వైద్యశాలకు తరలించారు.పరిస్థితి విషమంగా ఉండడంతో ఒంగోలు రిమ్స్( Ongole rims ) కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

వరప్రసాద్, ఉమాదేవి దంపతులకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు సంతానం.కుమారుడు గుంటూరులోని ఓ ప్రైవేట్ స్కూల్ లో చదువుతున్నాడు.ఒక కుమార్తెకు ఆదివారం గుంటూరులో పరీక్ష ఉండగా, కుమారుడిని కూడా చూసి వద్దామని అనుకున్నాడు.అయితే వరప్రసాద్ తెల్లవారుజామున తన ఆరోగ్యం బాగాలేదని, మెడిసిన్ తెచ్చుకుంటానని బయటకు వెళ్ళి ఇలా తన ప్రాణాలను కోల్పోయాడు.
భార్య ఉమాదేవి భర్త రావడం ఆలస్యం అవుతుందని భావించి కుమార్తెతో సహా ముందుగా వెళుతున్నానని, డ్రైవర్ ను తీసుకొని తర్వాత కారులో గుంటూరు రావాలని భర్తకు చెప్పి బయలుదేరింది.ఆమె దారి మధ్యలో ఉండగా భర్త చనిపోయిన సంగతి తెలిసి కన్నీరుమున్నీరుగా విలపించింది.