మోల్డోవాలో ఒక షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది.ఒకరు 62 ఏళ్ల వ్యక్తిని బ్రతికుండగానే మట్టిలో పూడ్చిపెట్టారు.
నాలుగు రోజుల పాటు భూమిలో ఆ వృద్ధుడు అలాగే గడిపాడు.అతడిని చివరికి పోలీసులు రక్షించారు.ఈ ఘటన ఉస్టియా(Ustia) అనే గ్రామంలో జరిగింది.74 ఏళ్ల మహిళ మరణం గురించి దర్యాప్తు చేస్తున్న సమయంలో పోలీసులకు ఈ విషయం తెలిసింది.ఈ ఘటన స్థానికుల్లో భయాందోళనలు సృష్టించింది.62 ఏళ్ల వ్యక్తి నాలుగు రోజులు ఎలా బతికి ఉన్నాడో అని చాలామంది ఆశ్చర్యపోతున్నారు.పోలీసులు ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.
మోల్డోవాలో(Moldova) ఒక 74 ఏళ్ల మహిళ హత్య కేసులో ఊహించని మలుపు చోటుచేసుకుంది.మహిళ ఇంట్లోనే కిరాతకంగా హత్యకు గురైనట్లు పోలీసులు గుర్తించారు.మహిళ తన భర్తతో కలిసి నివసిస్తుండేది.
కానీ, భర్త కనిపించకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది.భర్త కోసం ఊరంతా గాలించడం ప్రారంభించారు.
అధికారులు తమ దర్యాప్తును కొనసాగిస్తున్నప్పుడు, వారు మహిళ ఇంటి దగ్గర నేల కింద నుంచి వస్తున్న మూలుగులు, కేకలు విన్నారు.నిజాన్ని వెలికితీయాలని నిశ్చయించుకుని, వారు ఆ ప్రాంతంలో తవ్వకాలు ప్రారంభించారు.

అలా తవ్వుతుంటే నేల కింద దాగి ఉన్న తాత్కాలిక నేలమాళిగ కనిపించింది.లోపల 62 ఏళ్ల వ్యక్తి కూడా కనిపించడంతో వారు షాక్ అయ్యారు.ఆయన స్పృహలో ఉన్నప్పటికీ అతని మెడ, ముఖంపై గాయాల గుర్తులు ఉన్నాయి.నాలుగు రోజులుగా అతను అక్కడ చిక్కుకుపోయాడు.వృద్ధుడు తన 18 ఏళ్ల బంధువు తనని ఇలా పూడ్చేశాడని చెప్పాడు.ఈ ఘటన శనివారం(Saturday) రాత్రి జరిగింది.
వృద్ధుడు, యువకుడు శనివారం రాత్రి కలిసి మద్యం సేవించారు.అయితే, వారి మధ్య గొడవ జరిగి, యువకుడు వృద్ధుడిపై కత్తితో దాడి చేశాడు.
దాడిలో తీవ్రంగా గాయపడిన వృద్ధుడిని యువకుడు బేస్మెంట్లో బంధించి, దాని ఎంట్రన్స్ను మట్టితో కప్పివేశాడు.ఆ తర్వాత, ఆదివారం రాత్రి లేదా సోమవారం ఉదయం, యువకుడు వృద్ధుడి భార్యను కూడా హత్య చేశాడు.

ఈ ఘటన గురించి తెలుసుకున్న స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని యువకుడిని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.పోలీసులు 18 ఏళ్ల యువకుడిని అదుపులోకి తీసుకుని, అతనిని కస్టడీలో ఉంచారు.ఈ కేసులో యువకుడిపై మర్డర్, అట్టెంప్టెడ్ మర్డర్ కేసులు నమోదు చేశారు.అతను ఈ నేరాలలో దోషిగా నిరూపితమైతే జీవితకాల ఖైదు శిక్ష అనుభవించే అవకాశం ఉంది.ఈ ఘటన వృద్ధులపై జరుగుతున్న హింసను వెలుగులోకి తెచ్చింది.
బలహీన వర్గాలను రక్షించడానికి మరింత జాగ్రత్తలు, మద్దతు వ్యవస్థల అవసరాన్ని ఈ ఘటన నొక్కి చెబుతోంది.ఈ ఘటనతో చిన్న గ్రామం ఉస్టియా దుఃఖంలో మునిగిపోయింది.
గ్రామస్థులు ఆ మహిళ ఎప్పుడూ ఎవరికీ ఇబ్బంది కలిగించని మంచి మహిళ అని చెప్పారు.







