ఏపీలో రాజకీయ నేతలు పరస్పరం చేసుకుంటున్న విమర్శలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి.అధికార, విపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధాలు సాగుతూనే ఉన్నాయి.
పేదలకు మంచి జరిగినా గుర్తించలేని స్థాయిలో ఏపీలోని విపక్ష పార్టీ నేతలు ఉన్నారని తెలుస్తోంది.అధికార పార్టీపై, ఆ ప్రభుత్వంపై విమర్శలు చేయాలనే తప్పా ప్రజలకు మంచి జరుగుతుంది కదా అన్న విషయాన్నే మర్చిపోతున్నారని అనిపిస్తోంది.
పేదలకు ఏ మంచి జరిగినా ప్రతిపక్షాలు ఓర్చుకోలేక పోతున్నాయా అంటే అవుననే అర్థం అవుతోంది.ప్రజలకు వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందిస్తున్నా తట్టుకోలేక విమర్శల దాడికి పాల్పడుతున్నారని వాదనలు వినిపిస్తున్నాయి.
అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్న జగన్ సర్కార్ ను చూసి తమకు అధికారం వచ్చే అవకాశం ఉండదని విపక్ష నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న జగనన్న లే అవుట్లు పూర్తి అయితే రాజకీయంగా అవుట్ అయిపోతామన్న భయం చంద్రబాబును, ఆయన దత్త పుత్రుడు పవన్ కల్యాణ్ ను వెంటాడుతుందా.? అందుకే ఎక్కడ మేలు జరిగినా ఈ రాజకీయ రాబందులు వాలుతున్నాయా? అనేది ప్రజల మనసులో ప్రశ్నార్థకంగా మారింది.
రుతుపవనాలు ఆలస్యం కావడంతో వర్షాలు లేక పంటలు వేసే పరిస్థితి లేకపోతే ఎలా బ్రతకాలా అని రైతులు మనోవేధనకు గురయ్యారు.
కానీ కరుణించిన వరుణదేవుడు అపార వర్షాలు కురిపించేశాడు.గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఏనాడూ చుక్క నీరు జాడలేని వాగులు సైతం నిండుకుండల్లా దర్శనమిస్తున్నాయి.ఎండాకాలంలో వట్టిపోయిన బావులు సైతం తల్లికట్టును దాటి నీటితో తొణికిసలాడుతున్నాయి ఇప్పుడు.రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి.
రుతు పవనాలు ప్రభావమే కాకుండా అల్పపీడనం కూడా ఏర్పడటంతో భారీ వర్షాలు కురిశాయి.దీంతో గతంలో చంద్రబాబు నిర్మించిన హైదరాబాద్ మహా నగరం సైతం అతలాకుతలం అయింది.
లోతట్టు ప్రాంతాలన్నీ జలదిగ్బంధంలో చిక్కుకుని పోవడంతో కార్లకు బదులు బోట్లు తిరిగాయి.అంతేకాదు కొన్ని ప్రాంతాల్లో నీళ్లలో వాహనాలు, మూగ జీవాలే కాకుండా ప్రజలు కూడా కొట్టుకుపోయిన పరిస్థితులు నెలకొన్నాయి.
అయితే ఈ పరిస్థితి దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ కు కనిపించడం లేదా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు.
సినిమా రిలీజ్ పనులు, కలెక్షన్ల లెక్కలు వేసుకుంటూ బిజీగా ఉన్న జనసేనాని ఈ పరిస్థితిని చూడలేదా .? చూసేందుకు కళ్లు లేవా.? అంటూ పలువురు విమర్శిస్తున్నారు.రెండేళ్ల క్రితం భారీ వర్షాలకు మద్రాస్ నగరం చిగురుటాకులా వణికింది.అత్యంత ప్రణాళికాబద్ధమైన నగరంగా పిలిచే ఐటి సిటీ బెంగళూరు ఏమైంది.? అంతెందుకు ఇటీవల దేశ రాజధాని వరదలతో విలవిలలాడలేదా? గతంలో భాగ్యనగరాన్ని మూసీ ముంచెత్తలేదా ? గోదావరి వరదల్లో తడిసి ముద్దవుతున్న లంకగ్రామాల పరిస్థితి పవన్ కు కనబడటం లేదా …? ఇప్పటికే రోడ్లు, కాలువలు, డ్రైనేజీలు ఇవన్నీ రూపొంది సకల సౌకర్యాలతో తులతూగుతున్న మహానగరాలే కుండపోతకు తట్టుకోలేక నీట మునుగుతున్న తరుణంలో ఏమీ లేని సాధారణ లే అవుట్లు నీళ్లతో కాక.ఇంకేలా ఉంటాయో జనసేనానే ఒక్కసారి ఆలోచించుకోవాలని చెబుతున్నారు.
ఒకసారి కాలనీ రూపొందిన తరువాత ప్రజలు ఒక్కొక్కరుగా ఇల్లు కట్టుకుంటుండగా అక్కడ రోడ్లు వేయడం, డ్రైనేజీ వ్యవస్థ రూపొందించడం, వర్షపు నీరు వెళ్లేందుకు కాలువలు వంటి ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరుగుతుంది .అవేమీ లేకుండా ఖాళీగా ఉన్న లే అవుట్ లలో లేదా ఖాళీ భూభాగంలో ఎక్కడైనా వాననీరు నిల్వ ఉండటం సర్వ సాధారణం.ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ ను చదవకుండా కొంచెం ఆలోచిస్తే పరిస్థితిపై అవగాహన వస్తుందని కొందరు సూచిస్తున్నారు.
ప్రజలు సంతోషంగా ఇళ్లు కట్టుకుంటున్న సమయంలో వర్షం వల్ల కాస్త అంతరాయం ఏర్పడింది.
అయితే ఇదంతా ఓర్వలేని చంద్రబాబు పేదలకు ఇళ్లు ఇవ్వకముందే సెంటు భూమి దేనికి సరిపోతుందంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు.తాజాగా పవన్ సైతం లే అవుట్ లలో బురద ఉందంటూ చేసిన వ్యాఖ్యలపై పేద ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
విమర్శలు చేయాలనే ఉద్దేశ్యంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదని పలువురు అభిప్రాయ పడుతున్నారు.ఇకనైనా రాజకీయ విమర్శలు మాని ప్రజలకు జరిగే మంచిని చూడాలని పలువురు సలహా ఇస్తున్నారు.