నల్లగొండ జిల్లా:తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల( Telangana Assembly Elections ) ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది.మంగళవారం వరకు పార్టీల ప్రచార జోరు,అభ్యర్ధుల,అధినాయకుల ప్రసంగాల హోరు, చెవులు చిల్లులు పడేలా డీజే,మైకుల,డప్పుల శబ్దాలతో ఉమ్మడి నల్లగొండ జిల్లా దద్ధరిల్లి పోయింది.
మంగళవారంసాయంత్రం 5 గంటలకు ప్రచార పర్వానికి తెరపడడంతో ప్రశాంత వాతావరణం నెలకొంది.ప్రచారం ముగియడంతో ఎలాగైనా ఓటరు దేవుళ్ళ ప్రసన్నం చేసుకొనే ప్రక్రియలో భాగంగా ప్రలోభాలకు తెరలేపారు.
ఈసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలన్న ఊపుతో అధికార బీఆర్ఎస్ పార్టీ( BRS party ), ఏది ఏమైనా కారుకు బ్రేకులు వేసి తొలిసారి తెలంగాణలో అధికారం కైవసం చేసుకోవాలన్న కసితో కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రంలో రాజకీయ ప్రత్యామ్నాయం మేమేనని బీజేపీ,కనీసం డిపాజిట్ దక్కించుకొని పరువు కాపాడుకోవాలని ఇతర పార్టీలు,స్వతంత్ర అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం నిర్వహించాయి.ప్రచార సమయంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 సెంగ్మెట్లలో కాంగ్రెస్,బీఆర్ఎస్ మధ్యే బిగ్ ఫైట్ కొనసాగింది.12 కు 12 క్లీన్ స్వీప్ చేస్తామని రెండు పార్టీలు ధీమాగా ఉన్నాయి.అయినా ఇప్పటి వరకు చేసింది ఒక ఎత్తు ఈ రెండు రోజులు చేసేది మరో ఎత్తు అని భావించిన ఇరు పార్టీలు నిన్న ఈ రోజు ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే కార్యాన్ని షురూ చేసినట్లు రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
ఉమ్మడి జిల్లా ( Nalgonda District )వ్యాప్తంగా ఓటుకు ఇంత రేటు అని ఇప్పటికే ఫిక్స్ చేసినట్లు,దానికి తగిన వ్యవహారాలన్నీ ఇప్పటికే జరిగిపోయినట్లు ఇక ఓటరుకు మనీ,మద్యం చేరడమే తరువాయి అన్నట్లు తెలుస్తోంది.ఎన్నికల కమిషన్ ఎన్ని కట్టుదిట్టమైన ఏర్పాటు చేసినా కమిషన్ కళ్ళు కట్టి అయా పార్టీల అభ్యర్దులు
తమ కార్యాన్ని ఏ విఘ్నాలు లేకుండా చేసుకుపోతున్నారని సమాచారం.ఇప్పటికే em>పోస్టల్ బ్యాలెట్ లో పాల్గొన్న ఉద్యోగులకు రూ.2 వేల చొప్పున పంపిణీ చేశారనే ఆరోపణలు వచ్చాయి.అయితే ఇప్పుడు ఓటరు తమ వైపుకు తిప్పుకునేందుకు రూ.1000 నుండి రూ.5000 వరకు,దానికి తోడు మద్యం కూడా పంపిణీ చేయడానికీ కసరత్తు మొదలు పెట్టారని గుసగుసలు వినిపిస్తున్నాయి.ఇందులో భాగంగా ఇప్పటికే కొన్ని పార్టీలు గత పది రోజులుగా కుల సంఘాలను,అపార్ట్మెంట్ల జనాలను,విద్యార్థి,యువజన సంఘాల నాయకులను వేరువేరుగా సమావేశపరిచి ఆత్మీయ సమ్మేళనాలంటూ మందు విందులతో ప్రసన్నం చేసుకున్నారని,ఒక్కో ఓటుకి ఇంత రేటు అంటూ ఒప్పందాలు చేసుకున్నట్లు ప్రచారం జరుగుతుందని,
కొన్నిచోట్ల ఇప్పటికే మద్యం,డబ్బులు అందజేసి ఓటర్లపై నమ్మకం లేక దేవుడిపై ప్రమాణాలు కూడా చేయించుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి.
పోలింగ్ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామంటూ,ప్రత్యేక టీంలను నియమించామంటూ అధికార యంత్రాంగం చెబుతున్నా ఈ ప్రలోభాల పర్వానికి అడ్డుకట్ట వేసే పరిస్థితి లేదని,యధేచ్చగా అన్ని పార్టీలు ఎన్నికల నియమాలను తుంగలో తొక్కి విచ్చలవిడిగా మద్యం,డబ్బు పంపిణీ చేస్తున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.కనీసం ఈ ఒక్క ర రోజైనా ఎన్నికల కమిషన్ నిబంధనలు కఠిన తరం చేస్తే కొంతవరకు ప్రలోభాలకు నివారించే అవకాశం ఉందని ప్రజాస్వామికవాదులు అంటున్నారు.
చూడాలి మరి ఎన్నికల కమిషన్ ఏ విధంగా కట్టడి చేయబోతుంది? అభ్యర్దులు ఏ మార్గంలో ప్రజలను ప్రలోభ పెట్ట బోతున్నారో…!!
.