కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ఈ ఎనిమిది ఏళ్లలో భారతదేశంలో పేదరికం తగ్గుముఖం పడుతోందని వివిధ అంతర్జాతీయ సంస్థలు అంగీకరించాయని ప్రధాని మోడీ నిన్న షిమ్లా లో ఏర్పాటు చేసిన ‘గరీబ్ కళ్యాణ్ సమ్మేళనం‘ లో చెప్పారు.దేశ భద్రత మరియు దేశ సమగ్రత విషయాల్లో తన ప్రభుత్వం కల్పిస్తున్న ప్రాధాన్యతలు ఇది వరకటి ప్రభుత్వాల తీరుకి భిన్నంగా ఉన్నట్టు వారు తెలిపారు.
ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేశ సరిహద్దులు ఎప్పుడూ లేనంతగా సురక్షితంగా ఉన్నాయని మరియు ఈ ఎనిమిదేళ్ల పాలనలో అవినీతికి ఆస్కారం లేకుండా సులభతర వ్యాపారం భారత్ లో చెయ్యొచ్చు అనే చర్చ జరుగుతోందని ప్రధాని ఈ సందర్బంగా తెలిపారు.
దేశంలో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడం మరియు పేదరికం నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సఫలం అవుతున్నాయని వివిధ అంతర్జాతీయ సంస్థలు అంగీకరిస్తున్నాయని మరియు ఈ రోజు మన దేశం ఇతర దేశాలకు సహాయ సహకారాలు అందించే స్థాయికి ఎదిగినట్టు వారు తెలిపారు.
కరోనా సమయంలో 150 దేశాలకు పైగా కరోనా టీకాలను, ఔషధాలను సరఫరా చేయడం ద్వారా మన దేశం కూడా ప్రపంచంలో సత్తా ఉన్న దేశం గా పేరు సంపాదించింది అన్నారు ఆయన.షిమ్లాలోని రిడ్జ్ మైదాన్‌లో జరిగిన గరీబ్ కళ్యాణ్ సమ్మేళన్లో భాగంగా దేశవ్యాప్తంగా కేంద్ర పథకాల లబ్ధిదారులతో ప్రధాని మోడీ మాట్లాడారు.ఈ సందర్బంగా వారు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద రూ.21,000 కోట్ల రైతుల బ్యాంకు ఖాతాల్లోకి విడుదల చేశారు.

ప్రధాని ఇదే సమయం లో 2014 వరకు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి విమర్శలు గుప్పించారు.కాంగ్రెస్ హయం లో నిత్యం అవినీతి, ప్రభుత్వ స్కాం ల గురించే పత్రికలు, టీవీ లో చర్చ జరుగుతూ ఉండేది కానీ ఇప్పుడు అది పూర్తిగా మారిందని, ప్రభుత్వ పథకాలు అందరికి చేరుతున్నాయా వంటి చర్చలు జరుగుతున్నట్టు వారు తెలిపారు.ఆనాటి కాంగ్రెస్ నేతృత్వం లోని యూపీఏ ప్రభుత్వం అవినీతి పై పోరాటం చేయాల్సింది పోయి అదే అవినీతిలో కూరుకుపోయిందని, పేదలకు చేరాల్సిన ప్రభుత్వ డబ్బు అవినీతి పరుల చేతుల్లో పడుతున్నా కూడా ఎలాంటి చర్యలు చేపట్టకుండా పాలన సాగేదని మన్మోహన్ సింగ్ ప్రభుత్వం పై విమర్శనాస్త్రాలు సంధించారు.
40 నిమిషాల పాటు సాగిన ప్రధాని మోడీ ప్రసంగం లో వివిధ అంశాలను లేవనెత్తారు.2014 తర్వాత కేంద్రం ముస్లిం మహిళల కోసం తెచ్చిన ట్రిపుల్ తలాక్, ఆర్మీ జావానుల కోసం అమలు చేసిన వన్ రాంక్ వన్ పెన్షన్, జాన్ ధన్ ఖాతాలు, ఉజ్వల స్కీం, ప్రతీ ఇంటిలో మరుగుదొడ్లు, పేదల ఆరోగ్య భద్రత కోసం అమలు చేస్తున్న ఆయుశ్మాన్ భారత్ వంటి అనేక అభివృద్ధి పనులతో పాటు తమ ప్రభుత్వం పేద ప్రజల కోసం తీసుకొచ్చిన పథకాలను వివరించారు.ఈనాడు కేంద్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం విడుదల చేసే డబ్బు వందకి వంద శాతం ప్రజలకు చేరుతున్నట్లు అందుకు ‘జన్ ధన్, ఆధార్ మరియు మొబైల్‘ వీటి అనుసంధానం ద్వారా మధ్యవర్తుల ప్రమేయం లేకుండా, కమిషన్ ఇవ్వాల్సిన అవసరం లేకుండా ప్రతీ ఒక్కరికి లబ్ది చేకూరుతున్నట్లు తెలిపారు.







