తెలంగాణలో టీఆర్ఎస్ అధికారం కోసం సీఎం కేసీఆర్ ప్లాన్ చేస్తే ఖచ్చింతంగా సక్సెస్ అవుతుంది అని చేప్పవచ్చు.హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికతోనే టీఆర్ఎస్‌లో ఎలక్షన్ మూడ్ కనిపిస్తున్నది.
ప్రభుత్వ సంక్షేమ పథకాల కార్యక్రమాలు, భూమిపూజలు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు.సందర్భమేదైనా పొలిటికల్ స్పీచ్‌లు వినిపిస్తున్నాయి.
షెడ్యూలు ప్రకారం జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నరకు పైగా సమయమున్నా టీఆర్ఎస్ మాత్రం ప్రతీ వేదికను ఎలక్షన్ క్యాంపెయిన్‌గానే భావిస్తున్నది.
గత నెల 8న వనపర్తిలో జరిగిన బహిరంగసభలో సీఎం కేసీఆర్ ఎలక్షన్ స్పీచ్ ఇచ్చారు.
సిట్టింగ్ ఎమ్మెల్యే నిరంజన్ రెడ్డిని లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.తాజాగా మంగళవారం ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు భూమి పూజ చేసిన సందర్భంగా చివర్లో రాజకీయ ప్రసంగమే చేశారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందిగా హెచ్చరించారు.మతం, కులం పేరు మీద కొన్ని పార్టీలు చిల్లరమల్లర రాజకీయాలు చేస్తున్నాయంటూ బీజేపీని ఉదహరించారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏడున్నరేళ్ళ టీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ నగరంలోనే సుమారు రెండున్నర లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని, కొత్త పరిశ్రమలు నెలకొన్నాయని, లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని, ఇప్పుడు మతం పేరుతో ప్రజల్లో చీలిక తెచ్చి ప్రశాంత వాతావరణాన్ని దెబ్బతీయడానికి కొన్ని దుష్టశక్తులు పుట్టుకొచ్చాయన్నారు.వాటి భ్రమల్లో పడి తాత్కాలిక ప్రలోభాలకు లోనైతే అప్పటికప్పుడు మజా ఉండొచ్చేమోగానీ శాశ్వతంగా ప్రయోజనాలు దెబ్బతింటాయని ప్రజలకు వివరించారు.

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా 2018లో ప్రస్తావించిన అంశాలనే సీఎం కేసీఆర్ ఇటీవలి కాలంలో నొక్కిచెప్తున్నారు.కళ్ళముందు కనిపిస్తున్న ఫలాలను, అభివృద్ధిని, సంక్షేమాన్ని చూసి ఏ పార్టీకి ఓటు వేయాలో డిసైడ్ చేసుకోవాలని కోరుతున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ గెలుపుతో కేంద్ర ప్రభుత్వంతో గ్యాప్ పెరిగింది.అప్పటివరకూ ఆ పార్టీతో స్నేహపూర్వక సంబంధాల్లో ఉన్న కేసీఆర్ గతేడాది అక్టోబరు నుంచి వైఖరిని మార్చుకున్నారు.
బీజేపీని ప్రధాన రాజకీయ ప్రత్యర్థిగా పేర్కొంటున్నారు.కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఏకరువు పెడుతున్నారు.
రాష్ట్రం పట్ల కేంద్రం వివక్షతో వ్యవహరిస్తున్నదంటూ తెలంగాణ సెంటిమెంట్ రాజేసే ప్రయత్నం చేస్తున్నది.
కులం, మతం పేరుతో ప్రజల మధ్య భావోద్వేగాలను రెచ్చగొట్టే బీజేపీ ఏ దుకాణంలో ఏది కొనాలో, ఏది కొనవద్దో రెచ్చగొడుతున్నదని, ఆంక్షలను విధిస్తున్నదని, ప్రశాంత వాతావరణాన్ని కలుషితం చేస్తున్నదంటూ వ్యాఖ్యానించారు.
ఎనిమిదేళ్ళుగా కర్ఫ్యూలు, 144వ సెక్షన్‌లు, మతఘర్షణలు, శాంతిభద్రతల సమస్యలు లేకుండా ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ ఒక విశ్వ నగరంగా గుర్తింపు పొందిందని పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు.మతోన్మాద దుష్టశక్తులు ఇప్పుడు కత్తులు, తుపాకులంటూ రెచ్చగొడితే మన కాళ్ళను మనమే నరుక్కున్నట్లవుతుందన్నారు.

ఏడున్నరేండ్ల తెలంగాణలో అమలవుతున్న పథకాలు మొత్తం దేశానికే దిక్సూచిగా మారాయంటూ కేసీఆర్‌తో పాటు మంత్రులు కూడా ప్రతీరోజు ప్రస్తావిస్తున్నారు.దళితబంధు, రైతుబంధు, రైతుబీమా, ఆసరా పింఛన్లు, 24 గంటల కరెంటు, కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరధ తదితర పథకాలన్నింటినీ అవకాశమున్న ప్రతీచోట వల్లెవేస్తున్నారు.గుజరాత్, మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు లాంటి రాష్ట్రాలు దశాబ్దాల క్రితమే ఏర్పడినా అక్కడ లేని అభివృద్ధి, సంక్షేమం తెలంగాణలో ఏడున్నరేండ్లలోనే సాధ్యమైందని గుర్తుచేస్తున్నారు.
టీఆర్ఎస్ చేసిన అభివృద్ధి కళ్ళముందు కనిపిస్తూ ఉన్నదని, ప్రజలు దీన్ని చూసి సరైన నిర్ణయం తీసుకోవాలని అప్పీల్ చేయడం ఎన్నికల సభను తలపించింది.
గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీల గురించి పెద్దగా ఆందోళనపడని టీఆర్ఎస్ ఈసారి మాత్రం గాభరాకు గురవుతున్న వాతావరణం కనిపిస్తున్నది.ఒకవైపు బీజేపీని దక్షిణాదిలో కర్నాటక మినహా ఎక్కడా ఎంట్రీ లేని ఒక పెద్దస్థాయి ప్రాంతీయ పార్టీగా కేటీఆర్ అభివర్ణిస్తుండగా కేసీఆర్ మాత్రం ఆ పార్టీ మాటలను నమ్మి తాత్కాలిక మజాకు లోనైతే శాశ్వతంగా జీవితం ప్రమాదంలో పడుతుందని హెచ్చరించడం గమనార్హం.
కాంగ్రెస్ మాజీ ప్రెసిడెంట్ రాహుల్‌గాంధీయే స్వయంగా అమేధిలో ఓడిపోయారని, ఇప్పుడు ఆ పార్టీ గురించి తెలంగాణలో భయపడాల్సిన అవసరమే ఉండదంటున్నారు.

మరోవైపు ఆ పార్టీ తరఫున గెలిచిన పన్నెండు మంది ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ సాదరంగా ఆహ్వానించి చేర్చుకున్నది.రెండు పార్టీలను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూనే వాటిని ప్రత్యర్థులుగా, ఎన్నికల్లో వాటితో ఏదో ముప్పు తప్పదనే తీరులో ప్రసంగాల్లో ప్రస్తావించడం గమనార్హం.ప్రజలను అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరిస్తూనే ఆస్పత్రులకు శంకుస్థాపన వేదికను ఎన్నికల సభగా భావించి మరోసారి టీఆర్ఎస్‌ను దీవించాలి, ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేయడం చర్చనీయాంశమైంది
.






