ఏపీలో సీఎం చంద్రబాబు ఏ ముహూర్తాన మంత్రివర్గ ప్రక్షాళనకు ముహూర్తం పెట్టారో గాని ఇది రాజకీయంగా పెద్ద రచ్చ రచ్చ అయ్యేలాగానే కనిపిస్తోంది.మంత్రి వర్గంలో చోటు దక్కని వారు అధిష్టానంతో పాటు చంద్రబాబుకు హెచ్చరికలు, వార్నింగ్‌లు, రాజీనామాలతో ఏపీ రాజకీయం ఓ రేంజ్‌లో హీటెక్కుతోంది.
ఈ క్రమంలోనే కీలకమైన కృష్ణా జిల్లాలో సైతం అసమ్మతి జ్వాలలు ఎగసిపడుతున్నాయి.
మంత్రి పదవి రాలేదన్న అసంతృప్తితో ఉన్న విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు టీడీపీని వీడతారన్న వార్తలు జిల్లాలో ప్రకంపనలు రేపుతున్నాయి.
ప్రతిపక్షాలపై అసెంబ్లీలోను, బయటా, మీడియా చర్చల్లోను విరుచుకుపడే బొండా టీడీపీకి షాక్ ఇచ్చి జనసేన వైపు అడుగులు వేయబోతున్నట్టు విజయవాడ రాజకీయాల్లో వినిపిస్తోన్న టాక్.
వాస్తవానికి పవన్‌కు, బొండాకు మధ్య చాలా సన్నిహిత సంబంధాలే ఉన్నాయి.
గత ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ సీటును బీజేపీకి ఇస్తారని వార్తలు వచ్చినప్పుడు బొండా పవన్‌తో చంద్రబాబుకు చెప్పించుకుని టిక్కెట్టు తెప్పించుకున్నట్టు ప్రచారం ఉన్న సంగతి తెలిసిందే.ఇక పవన్ బర్త్ డేలతో పాటు పవన్ సినిమాలు రిలీజ్ అయినప్పుడు కూడా విజయవాడలో బొండా చేసే హంగామా అంతా ఇంతా కాదు.
తనకు మంత్రి పదవి దక్కపోవడంపై బొండా చంద్రబాబు కాపుల గొంతు కోశారని ఓపెన్‌గానే విమర్శలు చేశారు.చంద్రబాబు సైతం ఈ విషయంలో బొండాకు తీవ్రస్థాయిలో వార్నింగ్ ఇచ్చారట.
ఇక వచ్చే ఎన్నికలకు కాస్త ముందుగానే జనసేనలోకి జంప్ చేసేందుకు బొండా వేచి చూస్తున్నారట.ఆయనకు మద్దతుగా 18 మంది కార్పొరేటర్లు, 20 డివిజన్ల పార్టీ అధ్యక్షులు రాజీనామాకు సిద్దంగా ఉన్నారు.
టీడీపీలో ఉండడం కంటే జనసేనలోకి వెళ్లడమే బెటర్ అని కొందరు బొండా సామాజికవర్గం నేతలు కూడా ఆయనపై ఒత్తిడి తెస్తున్నారట.బొండా టీడీపీలో ఉన్నా ఆయన మనసంతా పవన్, జనసేన వైపే ఉన్నట్టు గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి.
ఇక మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో పాటు చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడంతో బొండా పార్టీలో ఇమడలేనని సన్నిహితులతో మొరపెట్టుకున్నట్టు తెలుస్తోంది.







