తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి.మరోసారి వివాదాలకు కేంద్రబిందువు అయ్యారు.
తన వైఖరితో ఎప్పుడూ వార్తల్లో వ్యక్తిగా నిలిచే ఆయన తాజాగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో దురుసుగా ప్రవర్తించారు.ఏకంగా కలెక్టర్‌పైనే దౌర్జన్యానికి దిగారు.
కలెక్టర్ నాగలక్ష్మిని ఏకవచనంతో సంబోధించారు.వేలెత్తి చూపుతూ బీ కేర్‌ఫుల్ అంటూ వార్నింగ్ ఇచ్చారు.
స్పందన కార్యక్రమంలో పాల్గొనడానికి జేసీ ప్రభాకర్ రెడ్డి ఈ ఉదయం అనంతపురం కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు.ఆ సమయంలో కలెక్టర్ నాగలక్ష్మి, జాయింట్ కలెక్టర్ స్పందన కార్యక్రమాన్ని నిర్వహిస్తోన్నారు.
ఒకవంక స్పందన కార్యక్రమం కొనసాగుతుండగానే జేసీ ప్రభాకర్ రెడ్డి కలెక్టరేట్ హాలులోకి దూసుకొచ్చారు.నేరుగా కలెక్టర్ వద్దకు వెళ్లి, తన అభ్యంతరాలను వ్యక్తం చేశారు.
సజ్జలదిన్నె భూములకు సంబంధించినవిగా చెబుతున్న ప్రాపర్టీల డాక్యుమెంట్లపై జిల్లా రెవెన్యూ అధికారులు సంతకం పెట్టి పంపించడాన్ని ఆయన తప్పుపట్టారు.దీనిపై తన అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు.
అందరూ కలెక్టర్లు కాలేరని, అలాంటి అదృష్టం కొంతమందికే దక్కుతుందని చెప్పారు.
కలెక్టర్ స్థానంలో కూర్చున్నందున ప్రజలకు మేలు చేయాలని అన్నారు.
కలెక్టర్ హోదాకు తగవంటూ హెచ్చరించారు.కలెక్టర్‌తో వాగ్వివాదానికి దిగిన సమయంలో వారించడానికి ప్రయత్నించిన కలెక్టర్ బాడీగార్డును కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి పక్కకు తోసేశారు.రెండు చేతులతో ఆయనను వెనక్కి నెట్టారు.తనకు పంపించిన డాక్యుమెంట్లపై సంతకం చేసిన అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారంటూ కలెక్టర్‌ను నిలదీశారు జేసీ ప్రభాకర్ రెడ్డి.ఆమె ఎదురుగా ఉన్న ఫైళ్లను ఎత్తి పడేశారు.తన చేతుల్లో ఉన్న డాక్యుమెంట్లను కూడా కలెక్టర్ ముందు విసిరేశారు.







