రాజన్న సిరిసిల్ల జిల్లా :బాధ్యత గల పౌరులు గా ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ఓటు ప్రాముఖ్యత వివరిస్తూ స్వీప్ కార్యక్రమాలు నిర్వహించాలని అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ అన్నారు.శనివారం అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని తన చాంబర్ లో పార్లమెంట్ ఎన్నికలలో పోలింగ్ శాతం పెరిగేలా స్వీప్ కార్యక్రమాలు నిర్వహణపై స్వీప్ కోర్ కమిటీ సభ్యులతో సమీక్షించారు.
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ శాతం పెంపోందించేలా స్వీప్ కార్యక్రమాల నిర్వహణ కోసం జిల్లాలో ఏర్పాటు చేసిన స్వీప్ కోర్ కమిటీ, ఎలక్టోరల్ లిటరసీ క్లబ్, చునావ్ పాఠశాల, ఓటర్ ప్రాముఖ్యత వివరిస్తూ చేపట్టాల్సిన కార్యక్రమాల కార్యాచరణను స్వీప్ నోడల్ అధికారి అదనపు డి.ఆర్.డి.ఓ శ్రీనివాస్ వివరించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District )లో ఉన్న 2 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో మొత్తం 4 లక్షల 70 వేల 438 మంది ఓటర్లు ఉన్నారని, ప్రతి ఒక్క ఓటరు ఎన్నికలలో తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోనెలా ఓటు ప్రాముఖ్యతపై విస్తృతంగా ప్రచారం చేయాలని అన్నారు.ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో ఓటర్లను చైతన్యపరిచేందుకు, ఓటింగ్ శాతం పెరిగేలా, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించేందుకు ఓటర్ అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
జిల్లాలో అత్యధిక పోలింగ్ శాతం నమోదయ్యే విధంగా ఓటు ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, గత ఎన్నికలలో తక్కువ పోలింగ్ నమోదైన ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అదనపు కలెక్టర్ సూచించారు.
డిసెంబర్ నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో సిరిసిల్ల జిల్లాలో 77.71% పోలింగ్ నమోదు కావడం జరిగిందని, వేములవాడ అసెంబ్లీ సెగ్మెంట్ లోని 13 పోలింగ్ కేంద్రాలలో, సిరిసిల్ల అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని 38 పోలింగ్ కేంద్రాలలో రాష్ట్రస్థాయి కంటే తక్కువ పోలింగ్ నమోదు అయిందని, వీటి పరిధిలో ప్రత్యేకంగా స్వీట్ కార్యక్రమాలు నిర్వహించాలని అదనపు కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.స్వీప్ కార్యక్రమాలలో భాగంగా జిల్లాలో ఉన్న అన్ని విద్యాసంస్థల్లో ఎలక్ట్రోరల్ లిటరసీ క్లబ్ లు ఏర్పాటు చేయాలని, జిల్లాలో ఉన్న అన్ని డిగ్రీ, పాల్టెక్నిక్, ఇంజనీరింగ్ కళాశాలలో క్యాంపస్ అంబాసిడర్లను నియమించాలని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని ఓటరు జాబితాలో నమోదు చేసి వారి ఓటుహక్కు వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని అన్నారు.
జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీలో ప్రత్యేక గ్రామసభలను ఏర్పాటు చేసి ఓటరు నమోదు, వినియోగంపై అవగాహన కల్పించాలని, ఓటు హక్కు ప్రాముఖ్యత వివరించే విధంగా కర పత్రాలను పంపిణీ చేయాలని, గ్రామంలోని మహిళలంతా తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకునేలా చూడాలని, మహిళా సంఘాలచే ర్యాలీల ద్వారా ప్రచారం నిర్వహించాలని అదనపు కలెక్టర్ సూచించారు.
వైద్య, ఆరోగ్య శాఖ పరిధిలో ఉన్న ఆశా వర్కర్లు, ఏఎన్ఎం ల ద్వారా ఓటు ప్రాముఖ్యతను వివరించాలని, ప్రభుత్వ ఆసుపత్రులలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సబ్ సెంటర్లలో ఓటు హక్కు ప్రాముఖ్యత వివరించే విధంగా గోడ ప్రతులను ప్రదర్శించాలని, సెక్స్ వర్కర్లంతా తప్పని సరిగా ఓటరుగా నమోదు చేసుకునేలా చూడాలని అదనపు కలెక్టర్ తెలిపారు.
జిల్లాలో ఉన్న దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్స్ సీనియర్ సిటిజన్లు అంతా తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని, జిల్లాలోఉన్న వృద్ధాశ్రమాలు, దివ్యాంగుల సంస్థలలో ఓటర్ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, 85 సంవత్సరాల వయసు పైబడిన వృద్ధులు, దివ్యాంగులకు అవసరమైతే ఇంటి వద్ద ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉందని వివరించాలని అన్నారు.ఈ సమావేశంలో స్వీప్ కోర్ కమిటీ సభ్యులు జిల్లా నోడల్ అధికారి శ్రీనివాస్, ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ శ్రీధర్ డిపిఆర్ఓ వి శ్రీధర్, ప్రసార భారతి ఆల్ ఇండియా రేడియో లక్ష్మీనారాయణ,డి.
పి.ఓ.వీర బుచ్చయ్య , డి.ఈ.ఓ.రమేష్ కుమార్ డి.ఎం.అండ్ హెచ్.ఓ సుమన్ మోహన్ రావు,యూత్ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్ రామదాసు, ఎన్.ఎస్.ఎస్ వైస్ ప్రిన్సిపాల్ టి శ్రీనివాస్, పి లక్ష్మీ రాజం, ఈ.డి.యం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.