ఈత నేర్చుకోవాలనే సరదా ఒక్క నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది.అతనికి ఈత నేర్చుకోవాలనే ఆశే అతనిని తిరిగిరాని లోకాలకు తీసుకెళ్లింది.
ఈ విషాద ఘటన నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం ముప్పారం గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది.పూర్తి వివరాల్లోకి వెళ్తే.
ముప్పారం గ్రామానికి చెందిన అల్లం నితిన్(12) ఈత నేర్చుకోవాలని అనుకున్నాడు.ఇక అందరిలా ఈత కొడుతూ నీళ్లలో కేరింతలు పెట్టాలనుకున్నాడు.
అయితే నాగార్జునసాగర్ ఎడమకాల్వకు నీటిని విడుదల చేసిన సంగతి తెలిసిందే.అయితే నీటి విడుదల చేసిన దగ్గర నుండి ఈత నేర్చుకునేందుకు తల్లిదండ్రుల అనుమతి కోసం రోజు అడుగుతూనే ఉన్నాడు.
అయితే కాల్వలో నీటి ప్రవాహ ఉధృతి పెరగడంతో తల్లిదండ్రులు బాలుడిని మందలిస్తూ వస్తున్నారు.అయితే మంగళవారం ఇంట్లో తండ్రి లేని సమయంలో తల్లికి ఈత నేర్చుకోవడానికి వెళ్తున్నట్లు చెప్పి వెళ్ళాడు.
మొదట తల్లి బాలుడి ఈత నేర్చుకోవడానికి వెళ్తానంటే ఒప్పుకోలేదు.కానీ బాలుడు ఆమెను ఎలాగో ఆలా ఒప్పించి అక్కడి నుండి ఈత నేర్చుకునేందుకు కాల్వ దగ్గరకు వెళ్ళాడు.
అయితే మధ్యాహ్నం కావడంతో నితిన్ ఇంకా ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు కొడుకు ఆచూకీ కోసం వెతకడం ప్రారంభించారు.అయితే స్థానికులు తల్లిదండ్రులకు బాలుడి సైకిల్‌పై కాల్వవైపు వెళ్తుండగా చూసినట్లు తెలిపారు.
దీంతో తల్లిదండ్రులు కాల్వ దగ్గరికి వెళ్లి చూడగా అక్కడ గట్టుపైన సైకిల్, బాలుడి బట్టలు కనిపించాయి.కొంత సమయం గడిచిన తర్వాత బాలుడి మృతదేహం కనిపించడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు.ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.