సూర్యాపేట జిల్లా: చివ్వెంల మండల కేంద్రంలోని బీసీ గురుకుల పాఠశాలలో గురువారం సాయంత్రం నీటి సంపు గోడ కూలి పవన్ అనే విద్యార్థి మృతి చెందడం,మరో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడడానికి అధికారులు,పాఠశాల ప్రిన్సపాల్ నిర్లక్ష్య వైఖరే కారణమని విద్యార్ధి సంఘాలు నాయకులు ఆరోపించారు.శుక్రవారం బీసీ గురుకుల పాఠశాల ముందు ఎస్ఎఫ్ఐ,బీసీ విద్యార్థి సంఘం, ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధనియాకుల శ్రీకాంత్ వర్మ, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు వీరబోయిన లింగయ్య,నిద్ర సంపత్ నాయుడు,ఎమ్మార్పీఎస్ మండల కన్వీనర్ కిరణ్, మాట్లాడుతూ విద్యార్ది మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని, విద్యార్థి కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు.నాలుగు నెలల క్రితమే నిర్మించిన గోడ ఎలా కూలుతుందని ప్రశ్నించారు.
గోడ నిర్మాణంలో నాణ్యత లోపించిందన్నారు.విద్యార్థుల సంక్షేమం చూడాల్సిన అధికారులు, ప్రిన్సిపాల్ అలసత్వం వహించడం సరైంది కాదన్నారు.
జిల్లాలో 9 బీసీ గురుకులాలు ఉండగా ఏ ఒక్క పాఠశాలకు పక్కా భవనం లేదని,అన్ని అద్దె భవనాల్లో ఉన్నాయని వారన్నారు.
పురాతనమైన భవనాల్లో విద్యార్థులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ జీవనం కొనసాగిస్తున్నారన్నారు.
ప్రమాదం జరిగినప్పుడు అధికారులు ప్రభుత్వం కంటి తుడుపు చర్యలు చేపట్టడం కాదని,శాశ్వత పరిష్కారం చేయాలని, గురుకులాలకు పక్కా భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు.గోడ కూలి గాయపడిన విద్యార్థులకు నాణ్యమైన వైద్యాన్ని అందించాలని, చనిపోయిన విద్యార్థి కుటుంబానికి ఉచిత హామీలు కాకుండా 50 లక్షల ఎక్స్గ్రేషియా, డబుల్ బెడ్ రూమ్, కుటుంబంలో ఒకరికి పర్మినెంట్ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు.
జిల్లాలో తరచూ ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్న ప్రభుత్వ ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోకపోవటం విడ్డూరంగా ఉందన్నారు.నాగారంలో ఉండాలిసిన బీసీ గురుకులం,పక్కా భవనం లేకపోవడంతో చివ్వెంల మండల పరిధిలో వున్నా అద్దె భవనంకు మార్చారన్నారు.
ఇప్పటికైనా మంత్రి స్పందించి గురుకులాలకు పక్కాభవనాలు ఏర్పాటు చేయాలని,అద్దె భవనాల యాజమానులతో అధికారులు కమిషన్ల కోసం కుమ్మక్కు కావడంతో ఇలాంటి ఘటనలు జరిగి విద్యార్థులు బలవుతున్నారన్నారు.ఇప్పటికైనా విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడకుండా విద్యార్థులకు న్యాయం చేయాలని లేనియెడల పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు బానోత్ వినోద్ కుమార్, నాయకులు శ్రీను, మనోహర్ అజయ్ వేణు, అరుణ్,విద్యార్దుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.