ముందు నుయ్యీ.వెనకాల గొయ్యి అన్న చందంగా మారింది అధికార యంత్రాంగం పరిస్థితి.
ఒకరు చెప్పినట్టు వింటే ఇంకొకరికి కోపం.పోని లైట్ తీసుకుందామా అంటే అసలుకే మోసం.
మాట వినడం లేదని పెద్దాయనకు కోపం వస్తే ఇంకేమైనా ఉందా.? గ‌్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు తెలంగాణ ఉన్నతాధికారులు, ఎన్నికల బాధ్యతలు నిర్వహిస్తున్న వారికి పెద్ద సవాలుగా మారింది.ఒక వైపు రాష్ర్టంలో అధికారంలో ఉన్న టిఆర్ ఎస్, మరో వైపు కేంద్రంలో ఉన్న బిజెపి ఈ రెండు పార్టీలకు చెందిన నాయకులతో అధికారులు పడుతున్న ఇబ్బందులు అంతా ఇంతా కాదు.ఎన్నికల నియమవళి విషయంలో బిజెపి, టిఆర్ఎస్‌తో పెద్ద తలనొప్పిగా మారిందినే అభిప్రాయాలు అధికారుల నుంచి వినిపిస్తున్నాయి.
ఎన్నికల నియమవళిని పకడ్బందిగా అమలు చేయాలని ఒక వైపు ఎన్నికల సంఘం నుంచి ఆదేశాలు వస్తున్నాయి.నియమవళిని తూ.చ తప్పకుండా పాటిస్తే కొన్ని రాజకీయ పరమైన ఒత్తిళ్లు.ఎన్నిక ప్రచారం, నిబంధనల విషయమై ప్రధానంగా అధికార టిఆర్ఎస్, కేంద్రంలోని బిజెపి, ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ ఇలా ఎవరికి వారుగా ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకుంటున్నారు.
రాష్ర్ట మంత్రులకు ఒక న్యాయం, ప్రతిపక్షంలో ఉన్నవారికి మరో న్యాయమా అని కొందరు నాయకులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.

ముఖ్యంగా హోర్డింగ్స్ విషయంలో జిహెచ్ఎంసి అధికారులు ఏకపక్షంగా వ్యవహారిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.ఈ విషయమై సాక్షాత్తూ కేంద్ర హోం సహాయక మంత్రి జి.కిషన్‌రెడ్డి కూడా ఆక్షేపించారు.హోర్డింగ్స్ అన్నీ అధికార టిఆర్ఎస్‌కే కేటాయించారని, ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వలేదని, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు.ఇలాంటి ఫిర్యాదులు వచ్చనప్పడు అధికారులకు పెద్ద సమస్యగా మారుతోంది.కేవలం అధికార టిఆర్ఎస్‌కు అనుకూలంగా వ్యవహారిస్తున్నారనే ప్రతిపక్షాలు బాహాటంగానే ఆరోపిస్తున్నాయి.కాగా బిజెపి నేతలు మాత్రం ఏకంగా కొన్ని సందర్భాల్లో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు తాము కేంద్రంలో ఉన్నామని, దీనిపై భవిష్యత్‌లో ఇబ్బందులు పడొద్దని వారు అధికారులను హెచ్చరించిన ఘటనలు అనేకం ఉన్నాయని అధికార వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
ఇలాంటి సందర్భాలు వచ్చినప్పడు తాము ప్రతిపక్షాలకు శత్రువులుగా కనిపిస్తున్నామని చెబుతున్నారు.మరో వైపు నియమవళికి విరుద్ధంగా అధికార టిఆర్ఎస్ ప్రవర్తిస్తోందని ప్రతిపక్షాల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి.
ఆ ఫిర్యాదుల ఆధారంగా చర్యలు తీసుకుందామా అంటే
భవిష్యత్‌లో
అనేక సమస్యలను ఎదుర్కొవల్సి ఉంటుందని అధికారులు భయందోళన వ్యక్తం చేస్తున్నారు.