రాజన్న సిరిసిల్ల జిల్లా: ప్రజారోగ్యంపై అన్ని జిల్లాల కలెక్టర్లు, వైద్యాధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదేశించారు.సీజనల్ వ్యాధులు, స్వచ్ఛదనం.
పచ్చదనం తదితరు అంశాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లతో బుధవారం మాట్లాడారు.
సీజనల్ వ్యాధుల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.
డెంగ్యూ మలేరియా, చికెన్ గునియా, టైఫాయిడ్ నిర్ధారణకు వైద్య ఆసుపత్రిలో రక్త పరీక్షలు ఎక్కువ సంఖ్యలో చేయాలని, రోగులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు.డెంగ్యూ కేసులపై ప్రత్యేక శ్రద్ధ వహించి ఎవరికైతే దవాఖాన సేవలు అవసరమవుతాయో వారికే అందించాలని పేర్కొన్నారు.
రోగులు అందరూ హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం ఉండదని స్పష్టం చేశారు ఈ విషయంలో ప్రైవేట్ ఆస్పత్రులపై నిఘా ఉంచాలని అవసరమైన కేసులను మాత్రమే అడ్మిట్ అయ్యేలా చూడాలని, అనవసరంగా రక్తం ఎక్కించడం ఇతర మెడిసిన్లు ఇవ్వకుండా చూడాలని ఆదేశించారు.
డెంగ్యూ కేసులు ఎక్కువగా నమోదైన ప్రాంతాలను పరిశీలించాలని నియంత్రణకు అన్ని చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
డెంగ్యూ పాజిటివ్ వచ్చిన వారింట్లో అందరికీ రక్తం పరీక్షలు చేయించి అవసరమైన వైద్యం అందించాలని ఆదేశించారు.
గురుకుల విద్యాలయాలు హాస్టల్స్ ను జిల్లా అధికారులు సందర్శించాలని అక్కడ దోమల నియంత్రణకు ఏ ఏ చర్యలు తీసుకుంటున్నారో పరిశీలించాలని పిల్లలు ప్రతిరోజు టిఫిన్, భోజనం చేసేముందు చేతులు శుభ్రంగా కడుక్కునేలా అవగాహన కల్పించాలని, నిల్వ ఉన్న ఆహారం తీసుకోవద్దని వారికి వివరించాలని ఆదేశించారు.
ప్రతి శుక్రవారం డ్రైడేగా, అలాగే ప్రతి నెలా మూడో శనివారం స్వచ్ఛదానం పచ్చదనం కార్యక్రమాలను కొనసాగించాలని ఆదేశించారు.ఇటీవల కార్యక్రమం విజయవంతం కృషిచేసిన అధికారుల అందరికీ అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమం రానున్న నెలల్లో నిరంతరం కొనసాగుతుందని వెల్లడించారు.
వన మహోత్సవంలో భాగంగా ఆయా జిల్లాలకు కేటాయించిన లక్ష్యాన్ని పూర్తి చేయాలని, మొక్కలకు జియో ట్యాంగింగ్ చేసి సంరక్షించాలని పేర్కొన్నారు.
ఈ సీజన్ ముగిసే వరకు పరిశుభ్రత చర్యలు పకడ్బందీగా చేపట్టాలని సిఎస్ ఆదేశించారు.ప్రభుత్వ దవఖానల్లో రోగులకు సంఖ్య కనుగుణంగా బెడ్ల సంఖ్య పెంచాలని, వారికి భరోసా కల్పించాలని తెలిపారు.
వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, డీఆర్డీఓ శేషాద్రి, డీపీఓ వీర బుచ్చయ్య, సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ కమిషనర్లు మీర్జా ఫసహత్ అలీబేగ్, అన్వేష్, డీఎంహెచ్ఓ వసంతరావు, డీసీహెచ్ఎస్ పెంచలయ్య, డీఈఓ రమేష్ కుమార్ ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.