అంతర్జాతీయ స్థాయిలో ప్రఖ్యాతి గాంచిన భారత సంతతికి చెందిన చలన చిత్ర దిగ్గజం అనంత్ సింగ్‌ను దక్షిణాఫ్రికా ప్రభుత్వం ప్రతిష్టాత్మక అవార్డుతో సత్కరించింది.తన ఆర్ధిక కార్యకలాపాలతో 100 బిలియన్ ర్యాండ్‌లకు పైగా దేశానికి అందించినందుకు గాను ‘‘South Africa Investment Conference Business Award’’కు ఎంపికయ్యారు.
ఈ మేరకు అధ్యక్షుడు సిరిల్ రాంఫోసా నుంచి అవార్డును అందుకున్నారు.అనంత్ సింగ్.
వీడియో విజన్ ఎంటర్‌టైన్‌మెంట్ కంపెనీని నెలకొల్పడంతో పాటు కేప్‌టౌన్ ఫిల్మ్ స్టూడియోను అభివృద్ధి చేశాడు.ఈ స్టూడియోలు ఏడాదికి 7 బిలియన్ ర్యాండ్‌ల ఆదాయాన్ని అందుకున్నాయి.
తద్వారా స్టూడియోలు ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు దక్షిణాఫ్రికా ఆర్ధిక వ్యవస్థకు 100 బిలియన్ ర్యాండ్‌లు సమకూరాయి.గత వారం జరిగిన నాల్గవ దక్షిణాఫ్రికా ఇన్వెస్ట్‌మెంట్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న అనంత్ సింగ్ ఈ అవార్డును అందుకున్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక, అంతర్జాతీయ కార్పోరేట్ సంస్థలు దేశంలో 332 బిలియన్ ర్యాండ్‌ల పెట్టుబడులు పెడతామని వాగ్థానం చేశాయి.a
డర్బన్‌లో 7.5 బిలియన్ ర్యాండ్ల పెట్టుబడులతో ఒక భారీ స్టూడియో కాంప్లెక్స్‌ను అభివృద్ధి చేస్తానని అనంత్ సింగ్ ఈ సదస్సులో ప్రకటించారు.కేప్‌టౌన్ కంటే ముందే డర్బన్‌లో స్టూడియో నిర్మించాలని భావించినట్లు ఆయన తెలిపారు.
కానీ చట్టపరమైన కేసుల కారణంగా ఇది సవాలుగా మారిందన్నారు.ఇప్పుడు పరిస్థితులు చక్కబడటంతో డర్బన్‌లో స్టూడియోలు నిర్మించడం ప్రారంభిస్తామని, ఈ ఏడాది చివరి నాటికి పనులు మొదలుపెడతామని అనంత్ సింగ్ తెలిపారు.
ఈ సందర్భంగా అధ్యక్షుడు రాంఫోసా మాట్లాడుతూ.అనంత్ సింగ్‌ను దేశంలోని గొప్ప చిత్ర నిర్మాతలలో ఒకరిగా అభివర్ణించారు.