సిల్క్ స్మిత పరిచయం అవసరం లేని పేరు.దక్షిణాదిన ఒక వెలుగు వెలిగిన నటి.తెలుగు, తమిళ, కన్నడ మలయాళ వంటి దక్షిణాది భాషల్లోనే కాకుండా హిందీ భాషా చిత్రాల్లో కూడా తనదైన ముద్ర వేసిన సిల్క్ స్మిత జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయిన విషయం తెలిసిందే.1960 డిసెంబర్ 2న పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరులో నిరుపేద కుటుంబంలో జన్మించారు.అతిచిన్న వయసులోనే పెళ్లి కావడం, భర్త మరియు అత్తమామలు ఆమెను చిన్న చూపు చూడడం వంటి కారణాల వల్ల ఆమె ఇంట్లోంచి పారిపోయారు.
అలా మద్రాస్ వెళ్ళిన సిల్క్ స్మిత సినిమాల్లో నటించాలని అనుకున్నారు. మేకప్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసిన సిల్క్ స్మిత, ఆ తర్వాత సైడ్ యాక్ట్రెస్ గా సినిమాలు చేశారు.1979 లో ఈమె నటించిన వండిచక్కరం అనే తమిళ సినిమా స్మిత జీవితాన్నే మార్చేసింది.రాత్రికి రాత్రే ఆమె స్టార్ అయిపోయారు.అంతే అక్కడి నుంచి ఆమె తిరిగి చూసుకోలేదు.ఈ సినిమాలో స్మిత బార్ గర్ల్ గా నటించారు.ఈ సినిమాకి కె.విజయన్ దర్శకత్వం వహించారు.ఆయనే విజయలక్ష్మి అనే పేరును సిల్క్ స్మితగా మార్చారు.
అదే పేరు ఇండియన్ సినిమాలో ఒక సంచలనం అయ్యింది.సిల్క్ స్మిత తమిళంలోనే కాకుండా, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా నటించారు.
రజనీకాంత్, కమల్ హాసన్, చిరంజీవి, మోహన్ లాల్, నాగార్జున, సుమన్, మమ్ముట్టి వంటి స్టార్లతో కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు.
ఈమె కెరీర్ ను మలుపు తిప్పిన సినిమాల్లో వండిచక్కరం మొదటిది కాగా, ఆ తర్వాత 1983 లో వచ్చిన అదుత వరిసు సినిమా ఈమెకు నటిగా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.
రజనీకాంత్, శ్రీదేవి ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాలో సిల్క్, ఉషా అనే పాత్రలో నటించారు.ఈ సినిమాలో వాజ్గా సాంగ్ కు ఈమె చేసిన డాన్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
ఇదే సినిమాలో రజనీకాంత్ తో కలిసి పెసా కూడతు అనే సాంగ్ లో డాన్స్ చేసి డాన్స్ లో హీరోలకేం తీసిపోని నటి అనే పేరు తెచ్చుకున్నారు.స్మిత తన కెరీర్ లో ఎక్కువగా ఐటం సాంగ్స్ చేసినా, సినిమా ఇండస్ట్రీ డైరీలో నటిగా తనకంటూ కొన్ని పేజీలు ఉంచుకున్నారు.
వాటిలో ఆమె నటించిన “మూండ్రామ్ పిరై” ఒకటి.
కమల్ హాసన్, శ్రీదేవి హీరో, హీరోయిన్ గా 1982 లో వచ్చిన ఈ సినిమాలో సిల్క్ స్మిత స్కూల్ హెడ్ మాస్టర్ భార్య పాత్రలో అద్భుతంగా నటించారు.తెలుగులో వసంతకోకిలగా డబ్బింగ్ చేశారు.ఇది కూడా సూపర్ హిట్ గా నిలిచింది.
ఉత్తమ జాతీయ చిత్రంగా ఈ చిత్రం అవార్డు దక్కించుకుంది.ఇక 1983 లో రజినీకాంత్ హీరోగా నటించిన తమిళ మార్షల్ ఆర్ట్స్ సినిమా అయిన పాయుమ్ పులిలో ఉషా అనే కేరెక్టర్ లో నటించారు.
ఈ సినిమా అప్పట్లో 133 రోజులు సక్సెస్ ఫుల్ గా ఆడింది.ఈ సినిమాలో రజినీ, స్మిత ఇద్దరూ కలిసి డాన్స్ చేసిన ఆడి మాసా కథడిక్కా, వా వా మామా పాటలు అప్పట్లో సూపర్ హిట్ అయ్యాయి.
ఇక 1989 లో మిస్ పమీల సినిమాలో సిల్క్ స్మిత హీరోయిన్ గా చేశారు.మలయాళంలో తెరకెక్కిన ఈ సినిమా ఆమె కెరీర్ లోనే బెస్ట్ మూవీగా నిలిచింది.ఈ ఐదు సినిమాలు ఆమె జీవితమనే పుస్తకంలో కీలకమైన పేజీలు.450 కి పైగా సినిమాల్లో నటించిన సిల్క్ స్మిత జీవితంలో ఊహించని పరిణామాలు ఎదురయ్యాయి.
తెర మీద ఆమె అందమైన రూపం కనిపించినంత అందంగా ఆమె జీవితం లేదు.ఆమె చాలా రోజులు మానసిక క్షోభ అనుభవించారు.డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారు.చివరికి 1996 సెప్టెంబర్ 23 న చెన్నైలోని తన అపార్ట్ మెంట్ లో ఆత్మహత్య చేసుకున్నారు.అయితే ఈమె జీవితం చాలా మందిని ఇన్స్ ఫైర్ చేసింది.అందుకే బాలీవుడ్ లో ఈమె జీవితం ఆధారంగా విద్యాబాలన్ హీరోయిన్ గా “ది డర్టీ పిక్చర్” సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే.
ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచి కాసుల వర్షం కురిపించింది.సిల్క్ స్మిత నటించిన చాలా సినిమాలు కాసుల వర్షం కురిపించడం ఒక ఎత్తు అయితే, ఆమె జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా కూడా కాసుల వర్షం కురిపించడం ఆమె మీద ప్రజలకు ఉన్న ఆదరణ, అభిమానం, గౌరవం వంటివి ఇంకా తగ్గలేదనడానికి నిదర్శనం.