తాజాగా శుక్రవారం జరిగిన క్వాలిఫైయర్-2 మ్యాచ్లో గుజరాత్( GT ) చేతులో ముంబై జట్టు( MI ) చిత్తుగా ఓడింది.62 పరుగుల తేడాతో గెలిచిన గుజరాత్ జట్టు ఫైనల్ కు దూసుకెళ్లింది.దీంతో వరుసగా రెండో ఏడాది టైటిల్ పోరులో గుజరాత్ నిలిచింది.మొదట టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు బౌండరీల వర్షం కురిపించింది.గుజరాత్ ఓపెనర్ గిల్ ( Shubman Gill ) ముంబై బౌలర్లకు చుక్కలు చూపించాడు.ప్రత్యర్థి బౌలర్ ఎవరైనా బంతి బౌండరీలు దాటుతూ ఉండడంతో గుజరాత్ జట్టు భారీ స్కోరును నమోదు చేసింది.
గిల్ 60 బంతుల్లో 7 ఫోర్లు, 10 సిక్స్ లతో 129 పరుగులు చేశాడు.దీంతో 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 233 పరుగుల స్కోరు నమోదయింది.

234 భారీ పరుగుల లక్ష్య చేదనకు దిగిన ముంబై జట్టు ఆరంభం నుంచే పేలవ ఆటను ప్రదర్శించింది.సూర్య కుమార్ యాదవ్ కాసేపు ఒంటరి పోరాటం చేసి పెవిలియన్ చేరాడు.గుజరాత్ జట్టు బౌలర్ మోహిత్ శర్మ ధాటికి ముంబై బౌలర్లు చేతులెత్తేసి వరుసగా అవుట్ అయ్యారు.మోహిత్ శర్మ ఏకంగా ఐదు వికెట్లు తీయడంతో 62 పరుగుల భారీ తేడాతో గుజరాత్ జట్టు ఘనవిజయం సాధించింది.

గుజరాత్ జట్టులో గిల్ 129, సుదర్శన్ (43, రిటైర్డ్ హార్ట్) తో అదరగొట్టారు.ఈ సీజన్లో గిల్ మూడవ సెంచరీ పూర్తి చేశాడు.ముంబై 18.2 ఓవర్లలో 10 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది.సూర్య కుమార్ యాదవ్ 61, తిలక్ వర్మ 43 పరుగులు చేశారు.మిగిలిన ముంబై బ్యాటర్లు చెప్పుకోదగ్గ పరుగులు చేయలేకపోయారు.మోహిత్ శర్మ ఐదు వికెట్లు, మహమ్మద్ షమీ రెండు వికెట్లు, రషీద్ ఖాన్ రెండు వికెట్లు తీసి గుజరాత్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.సెంచరీతో అదరగొట్టిన గిల్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది.







