ఖమ్మం జిల్లాలో అధికార బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది.పార్టీ అధిష్టానం తీరుపై పలువురు కార్పొరేటర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే బీఆర్ఎస్ కార్పొరేటర్లు కమర్తపు మురళీ, చావా నారాయణ, రావూరి సైదబాబు పార్టీపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.వీరంతా పార్టీని వీడుతున్నట్లు సమాచారం.
దీంతో జిల్లాలోని అసెంబ్లీ సెగ్మెంట్ లో నేతలపై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి పెట్టింది.బీఆర్ఎస్ లో ఉన్న అసంతృప్త కార్పొరేటర్లను హస్తం గూటికి చేర్చేందుకు రంగం సిద్దం అవుతోందని తెలుస్తోంది.
ఇందుకోసం జిల్లాలో ముఖ్యనేతలుగా రాణిస్తున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తీవ్ర కసరత్తు చేస్తున్నారు.ఈ మేరకు కార్పొరేటర్ కమర్తపు మురళీని కలిసిన నేతలు కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించారని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకోనే అవకాశాలు కన్పిస్తున్నాయి.ఆయన తరహాలోనే బీఆర్ఎస్ కార్పొరేటర్లు చావా నారాయణ, రావూరి సైదబాబు కూడా హస్తం గూటికి చేరనున్నారని సమాచారం.
ఇప్పటికే మాజీ ఎమ్మెల్సీ బాలసాని బీఆర్ఎస్ కు రాజీనామా చేయగా కార్పొరేటర్లు అదే బాట పట్టనున్నారని సమాచారం.దీంతో ఖమ్మం జిల్లా రాజకీయాలు చర్చనీయాంశంగా మారాయి.







