తెలంగాణ కాంగ్రెస్ లో ముసలం పుట్టింది.పార్టీ సీనియర్ నేతగా ఉన్న సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి గత కొద్ది రోజులుగా పార్టీలో చోటు చేసుకుంటున్న వ్యవహారలపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
ముఖ్యంగా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తనకు సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదని, కీలకమైన సమావేశాలకు తనకు ఆహ్వానాలు పంపడం లేదని తన నియోజకవర్గంలో జరిగే సభలకు సైతం తనకు సమాచారం పంపడం లేదని, ఇలా ఎన్నో కారణాలతో ఎప్పటి నుంచో అసంతృప్తితోనే ఉన్నారు.ఇటీవల కాంగ్రెస్ అధిష్టానానికి జగ్గారెడ్డి లేఖ రాశారు.
కాంగ్రెస్ కి రాజీనామా చేస్తున్నా అంటూ జగ్గారెడ్డి పేర్కొనడం కలకలం రేపింది.అయితే అధిష్టానం పెద్దలు కాంగ్రెస్ సీనియర్లను రంగంలోకి దించడం ఆయనను వారు బుజ్జ గించడం వంటి కారణాలతో అధిష్టానానికి పదిహేను రోజుల గడువు కూడా విధించారు.
అధిష్టానం సూచనలతోనో , లేక సొంతంగానో తెలియదు కానీ , జగ్గారెడ్డి విషయంలో సానుకూలంగా రేవంత్ రెడ్డి స్పందించారు.జగ్గారెడ్డి వ్యవహారం తమ దృష్టికి వచ్చిందని, తమ పార్టీ పెద్దలు ఆయనతో మాట్లాడుతున్నారని ఇప్పటికే ఆయన అధిష్టానం పెద్దల అపాయింట్మెంట్ కోరారు అని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు .అంతేకాదు జగ్గారెడ్డి మా నాయకుడు అంటూ రేవంత్ రెడ్డి ఆయనను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.తామంతా జగ్గారెడ్డి కి అండగా ఉంటామని ఆయన పై తప్పుడు ప్రచారం చేస్తున్న వ్యక్తుల పై సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేస్తామని రేవంత్ వ్యాఖ్యానించారు.
అంతే కాదు గతంలో తమ పార్టీ సీనియర్ నేత వి హనుమంత రావు పై కూడా ఇదే విధంగా సోషల్ మీడియాలో ప్రచారం జరిగిందని, దీనికి కారణం ఎవరా అని ఆరా తీస్తే కౌశిక్ రెడ్డి అనుచరులుగా తేలిందని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.

జగ్గారెడ్డి వ్యవహారం మా కుటుంబ సమస్యని అందరం కూర్చుని మాట్లాడుకుంటాం అంటూ వ్యాఖ్యానించారు.పిసిసి చీఫ్ స్థాయిలో తాము కొన్ని విషయాలు చెప్పలేనని, జగ్గారెడ్డి వ్యక్తిగతంగా తనకు మంచి స్నేహితుడని , నేను రాజకీయాలకు రాక ముందు కూడా జగ్గన్న తో పరిచయం ఉందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకువచ్చేందుకు తామంతా కలిసి పని చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు.
పూర్తిగా జగ్గారెడ్డి ని ఆకట్టుకునే విధంగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.అయితే జగ్గారెడ్డి మనసు మార్చుకుంటారో లేదో చూడాలి.








