టీఆర్ఎస్ నేతలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు.సంబంధం లేకున్నా తమ పిల్లలను అడ్డుపెట్టుకొని రాజకీయం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
మీకు అనునమానం ఉన్న మా పిల్లలను డ్రగ్స్ టెస్టుకు తీసుకొస్తా.డ్రగ్స్ టెస్టులకు నీ కొడుకు కేటీఆర్‌ను పంపుతావా అని సీఎం కేసీఆర్‌కు సవాల్ విసిరారు.
పిల్లల్ని అడ్డు పెట్టుకొని రాజకీయం చేస్తారా అంటూ విరుచుకుపడ్డారు.
హైదరాబాద్ పబ్ డ్రగ్స్ వ్యవహారంలో రేవంత్ రెడ్డి మేనల్లుడు సూదిని ప్రణయ్ రెడ్డి పట్టుబడ్డాడని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపించారు.
మీడియా ముందు రేవంత్‌తో అతడు ఉన్న ఫొటోను చూపారు.డ్రగ్స్ విషయమై ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న రేవంత్ రెడ్డి ఇప్పుడేమీ సమాధానం చెబుతారని నిలదీశారు.దీనిపై రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు.ఈ విషయమై మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానమిచ్చారు.24 గంటల పాటు మద్యం సరఫరాకు ఎవరు అనుమతిచ్చారని రేవంత్ ప్రశ్నించారు.ప్రణయ్ రెడ్డితో పాటు ఈ పబ్‌లో దొరికిన 145 మంది నుండి రక్త నమూనాలతో పాటు ఇతర నమూనాలను ఎందుకు తీసుకోలేదని నిలదీశారు.
ప్రణయ్ రెడ్డిని వదిలిపెట్టాలని తమ కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వాన్ని కోరారా చెప్పాలంటూ రేవంత్ ప్రశ్నించారు.

ప్రభుత్వానికి కావాల్సిన వారి కోసం పబ్‌లో దొరికిన వారిని వదిలేశారని రేవంత్ ఆరోపించారు.తమ పిల్లలపై ఉన్న ఆరోపణలపై సీబీఐతో పాటు ఏ విచారణకైనా తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.రాష్ట్రంలో డ్రగ్స్‌కు వ్యతిరేకంగా పోరాటం చేసిన చరిత్ర తనదేనని రేవంత్ చెప్పుకొచ్చారు.
గతంలో టాలీవుడ్ డ్రగ్స్ కేసు తర్వాతే సినీ ప్రముఖులు కేటీఆర్ దగ్గరయ్యారన్నారని ఆరోపించారు.అంతకుముందు సినీ ప్రముఖులు ఎవరూ కూడా కేటీఆర్‌తో సంబంధాలు లేవని చెప్పారు.
హైదరాబాద్‌ను డ్రగ్స్ హబ్‌గా మార్చే ప్రయత్నం కేసీఆర్ కుటుంబం చేస్తోందన్నారు.డ్రగ్స్‌పై విచారణ కోసం కేసీఆర్ కేంద్రానికి లేఖ రాయాలని రేవంత్ డిమాండ్ చేశారు.
తెలంగాణలో రైతులు, ఆందోళనలో ఉన్నారని రేవంత్ అన్నారు.అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.రైతుల కష్టాలను దృష్టిలో పెట్టుకోవాల్సింది పోయి. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు.
రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని దుయ్యబట్టారు.తెలంగాణ నుంచి బాయిల్డ్ రైస్ సప్లై చెయ్యమని ముఖ్యమంత్రి చేసిన సంతకం రైతుల పట్ల మరణశాసనంలా మారిందని అన్నారు.
రైతులు పండించిన వడ్లను కొనాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని తేల్చి చెప్పారు.రాష్ట్రం సేకరించిన ధాన్యాన్ని, కేంద్రం కొనాలన్నారు.

తెలంగాణలోని రైస్ మిల్లర్లతో కేసీఆర్ కుటుంబ సభ్యులు కుమ్మక్కు అయ్యారని రేవంత్ ఆరోపించారు.అందుకే ఈ పరిస్థితి వచ్చిందన్నారు.‘దళారులు, మిల్లర్లు రైతులను దోచుకుంటున్నారు.కనీస మద్దతు ధర కంటే, తక్కువకు కొంటున్న మిల్లర్లపై కేసులు పెట్టాలి.రేపు అన్ని జిల్లాల కేంద్రాల్లో కాంగ్రెస్ నిరసన కార్యక్రమాలు చేపడతాం.ఎల్లుండి సివిల్ సప్లైస్, విద్యుత్ సౌధలను ముట్టడిస్తాం.
కేసీఆర్‌కు రైతులను ఆదుకోవాలని ఉంటే, పార్లమెంట్ సమావేశాల సమయంలో ధర్నా చెయ్యాలి.మోదీకి కేసీఆర్ ఎందుకు భయపడుతున్నారు.
ప్రధానిని కలిసేందుకు ఎంపీలు, సీఎం ఎందుకు ప్రయత్నం చేయటం లేదు.చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ ప్రధాని మోదీని కలవాలని రేవంత్ అన్నారు.







