తెలంగాణ కాంగ్రెస్ లో మంచి వాక్చాతుర్యం ఉన్న నాయకుడిగా గుర్తింపు పొందిన ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తనదైన శైలిలో రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడుతూ విమర్శలు చేయడంలో దిట్టగా పేరుపొందారు.ప్రస్తుతం హాథ్ సే హాథ్ జోడో జోడో పాదయాత్ర నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ ను టార్గెట్ చేసుకుని పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు.తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెబుతూ బిజెపి , బి.ఆర్.ఎస్ పార్టీలపై విమర్శలతో విరుచుకుపడుతున్నారు.తాజాగా భూపాలపల్లి జిల్లాలో పాదయాత్ర నిర్వహిస్తున్న రేవంత్ బి ఆర్ ఎస్ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డిని టార్గెట్ చేసుకుంటూ పెద్ద ఎత్తున విమర్శలు చేశారు.

గండ్ర వెంకటరమణ రెడ్డి కాంగ్రెస్ నుంచి గెలిచి బీఆర్ఎస్ లో చేరారని, కాంగ్రెస్ ను మోసం చేసి బిఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేలను ఉద్దేశించి రేవంత్ ఫైర్ అయ్యారు.వెంకటరమణారెడ్డి మాత్రమే కాదు, కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి బిఆర్ఎస్ లోకి వెళ్లిన నాయకులందరి పైన రేవంత్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.మేం గెలిపిస్తే మా గుండెల మీద తన్ని ఆస్తుల సంపాదన కోసం కాంగ్రెస్ లో చేరిన డర్టీ డజన్ ఎమ్మెల్యేలు ప్రస్తుతం దొరగారి దొడ్లో పశువులుగా మారారు అంటూ రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇతర పార్టీల నుంచి గెలిచి న వారిని మోసం చేసిన కోవర్ట్ లకు కెసిఆర్ మంత్రి పదవులు ఇచ్చారని రేవంత్ విమర్శించారు.

బీఆర్ఎస్ నాయకులు దందాలు చేస్తున్నారని, భూ కబ్జాలకు పాల్పడుతూ, పేదల భూములు లాక్కుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.తెలంగాణలో ఉద్యోగాలు లేక ఉపాధి దొరకక నిరుద్యోగ యువత తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, అయినా కేసీఆర్, ఆయన కుటుంబం మాత్రం సంతోషంగా ఉందని ప్రజలంతా బాధల్లో ఉన్నారని రేవంత్ విమర్శించారు.బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి ముదనష్టపోళ్లు అంటూ రేవంత్ విమర్శించారు.
పసిపిల్లల్ని కుక్కలు పీక్కుని తింటే పట్టించుకోని దుర్మార్గపు ప్రభుత్వం ఇది అంటూ రేవంత్ విమర్శించారు.







