ప్రాథమిక, పారిశ్రామిక సేవా రంగాల అభివృద్ధికి రవాణా సౌకర్యాలు అత్యంత కీలకమని ఏ ప్రాంతమైనా, అభివృద్ధి చెందాలన్నా, పరిశ్రమలు రావాలన్నా రవాణా సౌకర్యం అనేది ప్రధానం అని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు.ఆదివారం ఈ మేరకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఆయన ఒక లేఖ రాశారు.
అందరికీ విమాన సదుపాయం అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఉడాన్ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటూ అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం టైర్-2, టైర్-3 నగరాల మధ్య విమాన సర్వీసులు ఏర్పాటు చేయడం జరిగిందని గుర్తు చేశారు.అందులో భాగంగా హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, విజయవాడ, తిరుపతి నుంచి కడపకు నేరుగా విమాన సర్వీసులు ఏర్పాటు చేసిన విషయం విదితమేనన్నారు.
గతంలో కడప నుంచి హైదరాబాద్ లేదా విజయవాడకు విమాన ప్రయాణం చేయాలంటే ప్రజలు తిరుపతి చెన్నై బెంగళూరుకు వెళ్ళవలసి వచ్చేదని అందువల్ల సమయం వృథా కావడమే కాకుండా ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా కూడా ఉండేదని వివరించారు.
దీనిని దృష్టిలో ఉంచుకొని 2018లో తెలుగుదేశం ప్రభుత్వం కడప నుంచి వివిధ ప్రదేశాలకు విమాన సేవలను ప్రవేశపెట్టిందని తెలిపారు.
దీంతో కడప నెల్లూరు అనంతపురం జిల్లాల ప్రజలు బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ ప్రాంతాలకు ప్రయాణించేందుకు విమాన సర్వీసులు సద్వినియోగం చేసుకున్నారన్నారు.
