చరణ్‌ కంటే ఎన్టీఆర్‌కు ఎక్కువ!     2018-07-08   02:17:22  IST  Raghu V

తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మల్టీస్టారర్‌కు జక్కన్న రంగం సిద్దం చేస్తున్నాడు. బాహుబలి చిత్రం తర్వాత అదే స్థాయిలో రాజమౌళి సినిమా ఉండాలని అంతా కోరుకున్నారు. అనుకున్నట్లుగానే అందరి అంచనాలను అందుకునేలా రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ల కాంబినేషన్‌లో ఒక భారీ చిత్రాన్ని చేసేందుకు సిద్దం అవుతున్నాడు. దశాబ్దాల కాలంగా తెలుగు సినిమా ప్రేక్షకులు మెగా మరియు నందమూరి కాంబోలో సినిమాను కోరుకుంటున్నారు. అది ఇన్నాళ్లకు సాధ్యం కాబోతుంది.

ఇక స్టార్‌ హీరోల మల్టీస్టారర్‌ చిత్రాలు అంటే ఏ హీరో పాత్ర ఏంటీ, ఏ హీరోకు ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది అంటూ ఆయా హీరోల ఫ్యాన్స్‌ బేరీజులు వేసుకుంటూ ఉంటారు. ఇక జక్కన్న తెరకెక్కిచబోతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్‌ల పాత్రలు రెండు కూడా చాలా బలమైనవిగా ఉంటాయని, అయితే రెండు పాత్రల్లో ఎన్టీఆర్‌ పాత్రకు కథ రీత్యా కాస్త ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుందని సినీ వర్గాల ద్వారా గుసగుసలు వినిపిస్తున్నాయి.

సినిమా ప్రపోజల్‌ తీసుకు వచ్చినప్పుడే దర్శకుడు రాజమౌళి ఈ విషయాన్ని రామ్‌ చరణ్‌ వద్ద చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే రాజమౌళి దర్శకత్వంలో నటించడంతో పాటు, ఎన్టీఆర్‌తో కలిసి నటించాలని చాలా కాలంగా కోరుకుంటున్న రామ్‌ చరణ్‌ అందుకు ఓకే చెప్పినట్లుగా సినీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఎన్టీఆర్‌ పాత్ర చుట్టు కథ తిరుగుతుందని, అయితే రామ్‌ చరణ్‌ పాత్ర కూడా తక్కువగా ఏమీ ఉండదు అంటూ చెప్పుకొస్తున్నారు. రాజమౌళి డైరెక్షన్‌ టీంలో ఉన్న ఒక వ్యక్తి ఈ విషయం గురించి మాట్లాడుతూ మీడియాలో వస్తున్న వార్త ఏదైతే ఉందో అది నిజమే, కాని దర్శకుడు రాజమౌళి ఆ విషయాన్ని ప్రేక్షకులు గుర్తించకుండా తెరకెక్కిస్తాడని నమ్మకం ఉందని చెప్పుకొచ్చాడు.

రామ్‌ చరణ్‌ స్క్రీన్‌ ప్రజెన్స్‌ ఎక్కువగా ఉండేలా జక్కన్న స్క్రీన్‌ప్లే సిద్దం చేస్తున్నట్లుగా ఆయన చెప్పుకొచ్చాడు. మొత్తానికి రాజమౌళి దర్శకత్వంలో సినిమాపై అంచనాలు అప్పుడే ఆకాశాన్ని తాకేలా వస్తున్నాయి. ఇక ఈ చిత్రంలో కీర్తి సురేష్‌ మరియు అదితి రావులు హీరోయిన్‌గా నటించే అవకాశం కనిపిస్తుంది. ఈ చిత్రాన్ని ఈ సంవత్సరం నవంబర్‌లో ప్రారంభించి, 2020 వేసవిలో చిత్రాన్ని విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. జక్కన్న తన బాహుబలి రికార్డులను ఈ చిత్రంతో బద్దలు కొడతాడేమో చూడాలి.