గోషామహల్ బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ ఏదో ఒక అంశంతో వార్తలు ఉండడంతో పాటు, వివాదాస్పద వ్యవహారాలలోనూ ఆయన పేరు ప్రముఖంగా వినిపిస్తూ ఉంటుంది.ముఖ్యంగా కరుడు కట్టిన హిందూ వాదిగా ఆయనకు పేరు ఉంది.
తెలంగాణలో రాజాసింగ్ కు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది.అంతేకాదు కేంద్ర బీజేపీ పెద్దలు అమిత్ షా , ప్రధాని నరేంద్ర మోది సైతం రాజాసింగ్ విషయంలో ఎప్పుడు సానుకూలంగానే ఉంటూ వస్తున్నారు.
అయితే కొద్ది నెలల క్రితం రాజాసింగ్ పై బీజేపీ అధిష్టానం సస్పెన్షన్ వేటు వేసింది.ఆయన వివాదాస్పద అంశాల తో పాటు, మతపరమైన వ్యాఖ్యలు చేస్తూ బిజెపికి తలనొప్పులు తెస్తుండడం, జైలుకు వెళ్లడం వంటివన్నీ పరిగణలోకి తీసుకున్న బిజెపి అధిష్టానం ఆయన పై సస్పెన్షన్ వేటు వేసింది.

ఇక ఆ తరువాత ఆయన తనకు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం సరిగా లేదంటూ తెలంగాణ ప్రభుత్వం పై నిరసన వ్యక్తం చేస్తూ, హడావుడి చేశారు .ఆయనకు తెలంగాణ ప్రభుత్వం మరో బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కేటాయించింది.ఇది ఇలా ఉంటే… తాజాగా రాజాసింగ్ రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే అంశం పైన స్పందించారు.తనపై బిజెపి అధినాయకత్వం సస్పెన్షన్ వేటు ఎత్తివేయకపోతే , తాను రాబోయే ఎన్నికల్లో పోటీ చేయనని రాజసింగ్ ప్రకటించారు.
పార్టీ తనపై విధించిన సస్పెన్షన్ తొలగిస్తుందనే నమ్మకంతో తాను ఉన్నానని, ఒకవేళ సస్పెన్షన్ తొలగించకపోతే, పోటీకి దూరంగా ఉంటాను తప్ప, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే ఉద్దేశం తనకు ఏమాత్రం లేదని ఆయన క్లారిటీ ఇచ్చారు.ప్రధాని నరేంద్ర మోది, అమిత్ షాలకు తాను వీరాభిమాని , పార్టీకి వ్యతిరేకంగా తాను ఎప్పుడు పని చేయబోనని రాజసింగ్ చెప్పుకొచ్చారు.

అంతేకాదు తెలంగాణ బిజెపి నేతలు అయిన బండి సంజయ్, లక్ష్మణ్, కిషన్ రెడ్డి ఆశీస్సులు తనకు ఉన్నాయని రాజసింగ్ చెబుతున్నారు.ఈ విధంగా అధిష్టానం పెద్దలతో పాటు, రాష్ట్ర బీజేపీ కీలక నేతలకు తాను వీర విధేయుడునని , పార్టీనీ బలోపేతం చేసే ఉద్దేశం తప్ప, వ్యక్తిగతంగా తనకు ఎటువంటి అజెండాలు లేవనే విషయాన్ని రాజసింగ్ఈ విధంగా వ్యక్తం చేస్తూ.అధిష్టానం పెద్దలు దృష్టితో పాటు, తెలంగాణ బీజేపీ కీలక నాయకులు దృష్టిలో తాను పడేవిధంగా, తన విషయంలో సానుకూలంగా వారంతా ఉండేలా రాజాసింగ్ ప్లాన్ వేసుకుంటున్నట్టుగా కనిపిస్తున్నారు.