త్వరలో భారత్‌లో జరగనున్న జీ-20 సదస్సు(G-20 Summit)లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Vladimir Putin) పాల్గొనే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినబడుతున్నాయి.అయితే దీనికి సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది.
ఈ విషయం ఎక్కడ పొక్కిందంటే, సెప్టెంబరులో ఇండియాలో జరిగే శిఖరాగ్ర సమావేశంలో పుతిన్ పాల్గొనే అంశాన్ని మీరు పరిశీలిస్తున్నారా? అని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్(Dmitry Peskov)ను అడిగినప్పుడు, దానిని పూర్తిగా తోసిపుచ్చలేమని, అప్పుడే దానిపైన మాట్లాడలేమని చెప్పడంతో ఇక పుతిన్ ఇక్కడకు రావడం ఖాయం అని విశ్లేషకులు అంటున్నారు.

G20లో రష్యా తన భాగస్వామ్యాన్ని కొనసాగిస్తోందని, దానిని ఇంకా కొనసాగించాలని భావిస్తున్నామని పెస్కోవ్ ఈ సందర్భంగా చెప్పడం జరిగింది.గత సంవత్సరం ఇండోనేషియాలోని బాలిలో జరిగిన G20 నాయకుల ఫోరమ్‌లో రష్యా ప్రతినిధి బృందానికి విదేశాంగ మంత్రి అయినటువంటి సెర్గీ లావ్‌రోవ్ నాయకత్వం వహించిన సంగతి విదితమే.అయితే అదే సమయంలో 2020, 2021లో పుతిన్ వీడియో లింక్ ద్వారా G20 శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యారు.జీ20 సదస్సుకు హాజరు కావాల్సిందిగా రష్యా అధ్యక్షుడిని భారత్ అధికారికంగా ఆహ్వానించింది.అదే సమయంలో క్రెమ్లిన్ కూడా దానిని ఆమోదించింది.
ఇది ప్రపంచంలోని ప్రధాన అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల కోసం ఒక వేదిక.

G-20 దేశాల సమూహంలో అర్జెంటీనా, బ్రెజిల్, కెనడా, ఆస్ట్రేలియా, చైనా, జర్మనీ, ఫ్రాన్స్, ఇండియా, ఇండోనేషియా, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, ఇటలీ, మెక్సికో, రష్యా, దక్షిణాఫ్రికా, టర్కీ, యునైటెడ్ కింగ్‌డమ్, సౌదీ అరేబియా, యునైటెడ్ స్టేట్స్ ఉన్నాయి.ఈ నెల ప్రారంభంలో విదేశాంగ మంత్రి లావ్‌రోవ్ న్యూఢిల్లీలో జరిగిన జి20 విదేశాంగ మంత్రుల 2 రోజుల సమావేశంలో పాల్గొన్నారు.ఉక్రెయిన్ వివాదంపై పాశ్చాత్య శక్తులతో పెరుగుతున్న ఘర్షణ, ఈ అంశంపై భారతదేశం దౌత్యపరమైన కఠినత్వం మధ్య ఈ సమావేశం జరిగింది.







