టాలీవుడ్‌లో ప్రస్తుతం స్టార్ హీరోలందరూ తమ సినిమా షూటింగ్స్‌లో బిజీగా ఉన్నారు.యంగ్ స్టార్స్ నుండి సీనియర్ హీరోల వరకు అందరూ చకచకా సినిమాలను షూటింగ్ చేస్తూ వాటిని రిలీజ్‌కు రెడీగా చేస్తున్నారు.
అయితే ఈ సినిమాలన్నీ కూడా పక్కా ప్లానింగ్ ప్రకారం వరుసగా రిలీజ్ చేయాలని హీరోలతో పాటు దర్శకనిర్మాతలు రెడీ అవుతున్నారు.కానీ వారందరినీ ముప్పుతిప్పలు పెడుతున్నది ఓ వర్గం.
వారి పేరు చెబితేనే తమ సినిమా నుండి ఏది బయటకు వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది సదరు దర్శకనిర్మాతల్లో.
చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా లీకు రాయుళ్ల దెబ్బకు విలవిలలాడుతున్నాయి.
ఇటీవల వరుసగా స్టార్ హీరోల సినిమాలకు సంబంధించిన లీకేజీలు ఆయా హీరోలతో పాటు అభిమానులను కూడా కలవరపెడుతున్నాయి.సదరు చిత్ర యూనిట్ నుండి ఇంకా అఫీషియల్‌గా రిలీజ్ కాకముందే ఆ సినిమాలోని సన్నివేశమో, పాటనో ఆన్‌లైన్‌లోకి ఎలా వచ్చేసిందని జుట్టు పీక్కుంటున్నారు చిత్ర యూనిట్ సభ్యులు.
ఈ కోవలో పుష్ప, సర్కారు వారి పాట, తాజాగా భీమ్లా నాయక్ లాంటి స్టార్ హీరోల సినిమాలు ఉన్నాయి.ఇవి ఇంకా షూటింగ్ స్టేజీలో ఉండగానే ఇలా లీకవుతున్నా, ఒక్క హీరో సినిమా నుండి మాత్రం ఇప్పటివరకు ఏ ఒక్క అంశం లీకవకపోవడం విశేషం.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న రాధేశ్యామ్ చిత్రం ఇప్పటికే షూటింగ్ ముగించుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.ఈ సినిమాలో చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, గ్లింప్స్ తప్ప మరే ఇతర అంశం కూడా బయటకు రానివ్వకుండా చిత్ర యూనిట్ జాగ్రత్త పడ్డారు.
అంటే ఈ సినిమాకు సంబంధించిన ప్రొడక్షన్ హౌజ్ ఎంత పకడ్బందీగా వ్యవహరిస్తుందో అర్థం చేసుకోవచ్చు.మరి మిగతా హీరోల సినిమాలకు సంబంధించిన ప్రొడక్షన్ హౌజ్‌లు ఎందుకు అంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో వారికే తెలియాలి అంటున్నారు పలువురు సినీ క్రిటిక్స్.