ప్రముఖ ఎన్ఆర్ఐ వ్యాపారవేత్త కేజీ అబ్రహం కేరళలోని పినరయి విజయన్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.చీఫ్ మినిస్టర్ డిస్ట్రెస్ రిలీఫ్ ఫండ్ (సీఎండీఆర్ఎఫ్)లో అవకతవకలను విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ బ్యూరో (వీఏసీబీ) వెలికితీసిన నేపథ్యంలో అబ్రహం స్పందించారు.
రిలీఫ్ ఫండ్ అర్హులైన అభ్యర్ధులకు చేరడం లేదని.లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఎల్‌డీఎఫ్)కు ఓటు వేసినందుకు చింతిస్తున్నామని అబ్రహం వ్యాఖ్యానించారు.
ఇకపై రాజకీయ నాయకులకు తాను ఏమీ ఇవ్వనని ఆయన స్పష్టం చేశారు.రాజకీయ నాయకులు ప్రవాస భారతీయుల నుంచి దోపిడీ చేస్తున్నారని అబ్రహం సంచలన వ్యాఖ్యలు చేశారు.
వరద సాయం కింద ఎన్ఆర్ఐల నుంచి అందుకున్న విరాళాల నిధులు నిజమైన లబ్ధిదారులకు చేరలేదన్నారు.ప్రవాస భారతీయులు కేరళలో పెట్టిన పెట్టుబడులకు భద్రత లేదని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

కేజీ అబ్రహం.కువైట్‌లో స్థిరపడిన మలయాళీ వ్యాపారవేత్త.ఎన్‌బీటీసీ గ్రూప్ భాగస్వామి, మేనేజింగ్ డైరెక్టర్‌గా ఆయన వ్యవహరిస్తున్నారు.కేరళ వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్‌లలోని ప్రభుత్వ అధికారులు, వైద్యులు , ప్రైవేట్ ఏజెంట్లు కుమ్మక్కయి సీఎండీఆర్ఎఫ్ నుంచి పెద్ద మొత్తంలో నిధులు పక్కదారి పట్టిస్తున్నారని విజిలెన్స్ విచారణలో వెల్లడైంది.

సీఎండీఆర్ఎఫ్‌ను ఎక్కువగా ప్రజల నుంచి అందే విరాళాలతో నిర్వహిస్తున్నారు.ప్రకృతి వైపరీత్యాలు, ప్రమాదాలు, అన్నదాతల మరణాలు, తీవ్రమైన వ్యాధుల కారణంగా ఆర్ధికంగా నష్టపోయిన అర్హులైన కుటుంబాలు, వ్యక్తులకు ఉపశమనం అందించడానికి సీఎండీఆర్ఎఫ్ పథకాన్ని అమలు చేస్తున్నారు.జిల్లా కలెక్టరేట్‌లలోని సీఎండీఆర్ఎఫ్ విభాగం ఇన్‌ఛార్జి అధికారులను ప్రభావితం చేసి.కొందరు ప్రైవేట్ వ్యక్తులు అవినీతిపరులైన కొందరు ప్రభుత్వ వైద్యుల సాయంతో నకిలీ పత్రాలు సృష్టించి భారీగా లబ్ధి పొందినట్లు విజిలెన్స్ దర్యాప్తులో తేలింది.
సీఎండీఆర్ఎఫ్ కోసం బ్రోకర్లు సమర్పించిన పత్రాలు, మెడికల్ సర్టిఫికేట్లు, ఆదాయ ధృవీకరణ పత్రాలు నకిలీ అని తేలింది.







