ప్రస్తుతం సమాజంలో మానవత్వం కనుమరుగు అవుతున్న సమయంలో ఓ పోలీస్ అధికారి తన మానవత్వాన్ని చాటుకున్నారు.పోలీసులు ప్రజల రక్షణకే కాదు వారికీ కష్ట సమయంలోను తోడుగా నిలుస్తారని ఈ అధికారి నిరూపించారు.
కరోనా కష్టకాలంలో అభాగ్యులకు అండగా నిలిచాడు.నా అనుకునే వాళ్ళు లేక నిరాశ్రయురాలైన ఓ వృద్ధురాలికి అన్ని తానై అండగా నిలిచాడు.
ఆమెను అన్ని విధాలుగా ఆదుకొని మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నాడు సిఐ రాజు నాయక్.
హైదరాబాద్ లోని ఖైరతాబాద్ పరిధిలోని తుమ్మలబస్తీలో యాదమ్మ జీవనం సాగిస్తుంది.
ఆమెకు పిల్లలు లేరు.ఆమె భర్త కొన్ని సంవత్సరాల క్రితం చనిపోయారు.
దీంతో ఆమె తుమ్మలబస్తీలో ఒంటరిగా జీవనం సాగిస్తుంది.ఆమెకు వయస్సు పైబడటంతో నిస్సహాయురాలిగా మారిపోయింది.
అయితే ఇటీవల కురిసిన వర్షాల కారణంగా ఆమె నివాసముంటున్న ఇల్లు కూలిపోయింది.పోలీస్ కానిస్టేబుల్ అందించిన సమాచారంపై సిఐ రాజు నాయక్ స్పందించి ఆమెకు ఆధారం కల్పించాలని అనుకున్నాడు.
తను వెంటనే తన మిత్రుడి, ఇద్దరి అధికారుల సహాయంతో యాదమ్మకు ఇల్లు కట్టించి ఇచ్చారు.అంతేకాకుండా ఆమెకు నిత్యావసర సరుకులను కూడా అందజేశారు.
సిఐ రాజు నాయక్ చేసిన సహాయం గురించి తెలుసుకున్న పోలీసు ఉన్నత అధికారులు అభినందించారు.







