బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి( MLA Koushik Reddy ) ఇంటి ఉద్రిక్త వాతావరణం నెలకొంది.బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లోకి( Congress ) వెళ్లిన ఎమ్మెల్యేలను ఉద్దేశించి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై నిన్నటి నుంచి విమర్శలు , ప్రతి విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి.
బీఆర్ఎస్ నుంచి గెలిచిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని( MLA Arikepudi Gandhi ) ఉద్దేశించి కౌశిక్ రెడ్డి విమర్శలు చేయడం , దానికి కౌంటర్ గా ఆయన ప్రతి విమర్శలు చేయడం, అరికెపూడి గాంధీ నివాసానికి తాను ఒంటరిగా వెళ్తానని కౌశిక్ రెడ్డి సవాల్ చేయడం, దానిని అరికెపూడి గాంధీ స్వీకరించడం జరిగాయి. అయితే కౌశిక్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడంతో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీనే కౌశిక్ రెడ్డి నివాసానికి స్వయంగా వెళ్లారు.
దీంతో అరికెపూడి గాంధీతో పాటు, ఆయన అనుచరులను పోలీసులు అరెస్ట్ చేశారు.
కౌశిక్ రెడ్డి సవాల్ నేపథ్యంలో ఆయన ఇంటికి అరికెపూడి గాంధీ వెళ్లారు .కౌశిక్ రెడ్డి ఇంటి బయట గాంధీ తన అనుచరులతో కలిసి ధర్నా చేపట్టడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి ఇంటిపై( MLA Koushik Reddy Home ) అరికెపూడి గాంధీ అనుచరులు కోడిగుడ్లు, టమాటాలు విసిరారు.
ఇక కౌశిక్ రెడ్డి నివాసం వద్ద అరికెపూడి గాంధీ ధర్నాకు దిగారు. కౌశిక్ రెడ్డికి దమ్ముంటే బయటకు రావాలని, తాను ఇక్కడే ఉన్నాను అంటూ గాంధీ సవాల్ విసిరారు.
వెంటనే అప్రమత్తమైన పోలీసులు అరికెపూడి గాంధీతో పాటు, ఆయన అనుచరులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి అరికెపూడి గాంధీ పై అనేక విమర్శలు చేశారు. తెలంగాణలో ఒక ఎమ్మెల్యే కే రక్షణ లేదని , సామాన్య ప్రజలకు ప్రభుత్వం ఎలా రక్షణ ఇస్తుందని కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. తనను హత్య చేసేందుకే అరికెపూడి గాంధీ తన అనుచరులతో తన ఇంటి వద్దకు వచ్చారని విమర్శించారు.
రేపు ఉదయం 11 గంటలకు బీఆర్ఎస్ పార్టీ తడాఖా ఏంటో చూపిస్తాను అని , అరికెపూడి గాంధీ చేసిన చర్యకు రేపు ప్రతి చర్య ఉంటుందని కౌశిక్ రెడ్డి హెచ్చరించారు.