అన్ని వైపుల నుంచి తమపై ఎదురుదాడి జరుగుతుండడంతో తెలంగాణ అధికార పార్టీ బిఆర్ఎస్ ( BRS ) స్పీడ్ పెంచింది.ఇప్పటి వరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విషయంలో సైలెంట్ గా ఉన్న బీఆర్ఎస్ ఇప్పుడు పవన్ ను టార్గెట్ చేసుకుని విమర్శలు మొదలు పెట్టింది .
ఇప్పటికే వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ( YS Sharmila )ఎన్నికల్లో పోటీ విషయం ప్రకటించారు.తాను ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుంటున్నానని , కాంగ్రెస్ ( Congress )కు మద్దతు ఇస్తున్నట్లు షర్మిల ప్రకటించారు.
ఈ నిర్ణయం పై ఒక్కసారిగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులతో పాటు, తెలంగాణ రాజకీయ వర్గాలు ఆశ్చర్యపోయాయి .నామినేషన్ల ప్రక్రియ మొదలైన తరువాత షర్మిల ఈ నిర్ణయం తీసుకోవడం పెద్ద కలకలం రేపుతోంది.
ఇదిలా ఉంటే తాజాగా నిన్న సంగారెడ్డిలో మంత్రి హరీష్ రావు( Hareesh Rao ) చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమరాన్ని రేపుతున్నాయి .తెలంగాణ ఎన్నికల సమయంలో తెలంగాణ ద్రోహులంతా ఒకటవుతున్నారని హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) తో బిజెపి చేతులు కలిపితే ఇప్పుడు కాంగ్రెస్ తో షర్మిల జట్టు కట్టిందని విమర్శించారు.పవన్ కళ్యాణ్ కు తెలంగాణ రావడం ఇష్టం లేదని భోజనం మానేశాడని, అలాంటి పార్టీకి లోపల నుండి చంద్రబాబు మద్దతు ఇస్తున్నారని విమర్శిస్తూ పవన్ ను తెలంగాణ ద్రోహి అనే ముద్ర వేశారు హరీష్ రావు.
ఇప్పటికే తెలంగాణలో టిడిపి పై బీఆర్ఎస్ అనేకసార్లు విమర్శలు చేసి ఇరుకున పెట్టింది. తెలుగుదేశం పార్టీ పై సీమాంధ్ర ముద్ర వేసి ఆ పార్టీని ఏ విధంగా దెబ్బతీసిందో ఇప్పుడు అదే విధంగా జనసేన ను టార్గెట్ చేసుకుని బీజేపీ ని దెబ్బకొట్టే ప్రయత్నం మొదలుపెట్టింది.
తెలంగాణ ఎన్నికలు ఇప్పటివరకు జనసేన పోటీ చేయలేదు.
కానీ ఈ ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసేందుకు ఉత్సాహం పడుతుంది. దీంతో పవన్ పై ఆంధ్ర ముద్ర వేసి తెలంగాణ లో జనసేనకు రాజకీయ బలం లేకుండా చేసే విధంగా బి.ఆర్.ఎస్( BRS ) ప్రయత్నాలు మొదలుపెట్టింది.జనసేన ప్రభావాన్ని తగ్గించడం ద్వారా బిజెపిని దెబ్బకొట్ట వచ్చు అనే వ్యూహంతో బీఆర్ఎస్ పార్టీ ఉన్నట్టుగా అర్థం అవుతోంది.