జనసేన పార్టీ రాజకీయాల్లోకి వచ్చి చాలా కాలమే అయినా కొత్తగా ఎన్నికల బరిలోకి వెళ్తోంది.ప్రధాన రాజకీయ ప్రత్యర్థులైన వైసీపీ, టీడీపీ పార్టీలను ఎదుర్కొని ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేస్తామని చెబుతున్నా అందుకు తగ్గట్టుగా మాత్రం ఆ పార్టీకి అనుకూల పరిస్థితులు కనిపించడంలేదు.
పవన్ కి క్లిన్ ఇమేజ్ ఉన్నా రాజకీయంగా క్షేత్రస్థాయిలో ఇప్పటికీ బలపడలేకపోవడం ఆ పార్టీకి పెద్ద శాపంగా మారింది.తొలిసారి ఎన్నికల బరిలోకి దిగుతున్న జనసేకు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు ఈ ఎన్నికలు నిజంగా అగ్నిపరీక్ష కాబోతున్నాయి.
ఎందుకంటే 175 నియోజకవర్గాల్లో ఓ 50 నియోజకవర్గాలు మినహా మిగిలిన చోట్ల బలమైన అభ్యర్థులు ఎవరూ ఆ పార్టీకి కనిపించడంలేదు.ఆ యాభైమందిలో ఓ పదిమంది వరకు మాత్రమే ప్రత్యర్థులకు ధీటుగా పోటీ ఇచ్చేవారు కనిపిస్తున్నారు.
రావెల కిషోర్ బాబు, నాదెండ్ల మనోహర్, పసుపులేటి బాలరాజు, రాపాక వరప్రసాద్, పాముల రాజేశ్వరి దేవి, రాజా అశోక్ బాబు వీరందరూ జనసేన అభ్యర్థుల జాబితాలో ఉన్నవారు.వీరంతా ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన వారే.
అయితే ఇప్పుడు వీరంతా తమ సొంత బలం కంటే పవన్ ఇమేజ్ ను నమ్ముకునే రంగంలోకి దిగుతున్నారు.ఇది జనసేనకు కొంచెం ఇబ్బందికర పరిణామమే.సిట్టింగ్ ఎమ్మెల్యేతో పోలిస్తే తాము ఎంతో కొంత మెరుగైన పాలన అందిస్తామనే భరోసా వారికి కల్పించాలి.అన్నింటికీ మించి ప్రత్యర్ధులకు ఆర్ధికంగానూ గట్టిపోటీ ఇవ్వగలగాలి.
క్యాడర్ బలం, స్ధానిక కారణాలు, అనేక పరిస్ధితులు ఎన్నికల్లో ప్రధాన పాత్ర పోషించేవే.వీటన్నిటిని తట్టుకుని ఎన్నికల క్షేత్రంలో సత్తా నిరూపించుకుంటేనే విజయం వరిస్తుందనేది పవన్ కి తెలియంది కాదు.

ప్రస్తుతం జనసేన అనుసరిస్తున్న వైఖరి చూస్తుంటే ఎన్నికలకు ఏ మేరకు సంసిద్ధంగా ఉన్నారనేది అర్ధం కాని పరిస్ధితి పవన్ అభిమానుల్లోనూ, కార్యకర్తల్లోనూ తలెత్తుతోంది.వామపక్ష పార్టీలతో కలిసి ఎన్నికలకు వెళ్లేందుకు చూస్తున్నా ఆ పార్టీ బలం కూడా అంతతమంత్రంగానే ఉండడంతో పవన్ ఈ ఎన్నికల్లో ఎలా గట్టెక్కుతాడా అనే సందేహం అందరిలోనూ ఉత్కంఠ రేపుతోంది.టీడీపీ, వైసీపీ మాత్రం తమ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులను ఇప్పటికే ఫైనల్ చేసి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతుంటే జనసేన లో మాత్రం ఏదో తెలియని నిస్తేజం కనిపిస్తోంది.