మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు పాకిస్థాన్ ప్రస్తుత హోంమంత్రి రాఫా సనావుల్లా సవాల్ విసిరారు.ఇమ్రాన్ ఖాన్ నాలుగు బుల్లెట్లు తగిలినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని రాణా ఛాలెంజ్ చేశారు.
ఇమ్రాన్ ఖాన్ కు అన్ని బుల్లెట్లు తగల్లేదని తెలిపారు.అయితే ఇటీవల ర్యాలీలో పాల్గొన్న ఇమ్రాన్ ఖాన్ పై కాల్పులు జరిగిన విషయం తెలిసిందే.
కాలికి బుల్లెట్ గాయాలు కావడంతో ఆయన ఆస్పత్రిలో చేరారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తనకు నాలుగు బుల్లెట్లు తగిలాయని వెల్లడించారు.
అంతేకాకుండా తనపై దాడికి పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, హోంమంత్రి రాణా సనావుల్లాతో పాటు సైన్యాధిపతి మేజర్ జనరల్ ఫైజల్ నజీర్ లే కారణమని ఇమ్రాన్ తీవ్ర ఆరోపణలు చేశారు.దీనిపై రాణా సనావుల్లా స్పందిస్తూ, దేశంలో అరాచకం లేవదీయాలన్న ఉద్దేశంతోనే తమ ముగ్గురిపై ఇమ్రాన్ ఖాన్ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
న్యాయవ్యవస్థను, సైన్యాన్ని రాజకీయాల్లోకి లాగడం దేశ ప్రయోజనాలకు తగని విషయం అని ఆయన స్పష్టం చేశారు.ఇమ్రాన్ ఖాన్ పై దాడి మతపరమైన కోణంలోనే జరిగుంటుందని, గతంలో ఇమ్రాన్ ఖాన్ బాధ్యతారాహిత్యంతో కూడిన అనేక వ్యాఖ్యలు చేశారని వెల్లడించారు.







