ఎప్పుడు నివురు గప్పిన నిప్పులా ఉంటుంది తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి.ఎప్పుడూ ఏదో ఒక వివాదం చోటు చేసుకుంటూనే ఉంటుంది .ప్రత్యర్ధి పార్టీలపై పోరాటాల కంటే , సొంత పార్టీలో నాయకుల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు వంటివి తెలంగాణ కాంగ్రెస్ లో మాత్రమే కనిపిస్తాయి. గ్రూపు రాజకీయాలకు పెట్టింది పేరుగా తెలంగాణ కాంగ్రెస్ గుర్తింపు పొందింది అంటే ఏ స్థాయిలో ఆ పార్టీ లో నాయకుల మధ్య ఆధిపత్యం నడుస్తుందనేది అందరికీ అర్థమవుతుంది.
ఇది చాలా కాలంగానే జరుగుతోంది.తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ గ్రూపు రాజకీయాలు మరింతగా పెరిగిపోయాయి. దీంతో పాటు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జిగా మాణిక్యం ఠాగూర్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఆయన వ్యవహరిస్తున్నారని, రేవంత్ అనుచరులకు కీలక పదవులను డబ్బులు తీసుకుని ఇచ్చారని అధిష్టానానికి ఫిర్యాదులు సీనియర్ నాయకులు చేశారు.ఇక రేవంత్ రెడ్డి ఏ కార్యక్రమం తలపెట్టినా సీనియర్లు సహకరించకపోగా , దానిని అడ్డుకునే ప్రయత్నం చేస్తుండడం మొదటి నుంచి తన విషయంలో సీనియర్లు ఇదే వైఖరితో వ్యవహరిస్తుండడం, ఇటీవల కాంగ్రెస్ అధిష్టానం దూతగా దిగ్విజయ్ సింగ్ తెలంగాణకు వచ్చి సీనియర్ నాయకులతో మంతనాలు చేసినా, తన విషయంలో వారి వైఖరి మారకపోవడం తదితర వ్యవహారాలతో రేవంత్ విసిగిపోయినట్టుగా కనిపిస్తున్నారు.

అందుకే తాను పిసిసి అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తానంటూ రేవంత్ మాట్లాడడం సంచలనంగా మారింది .అది కాకుండా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో కాంగ్రెస్ సీనియర్లు టచ్ లో ఉంటున్నారని , సీనియర్లకు మద్దతుగానే కాంగ్రెస్ అధ్యక్షుడు నిర్ణయాలు తీసుకుంటున్నారని భావిస్తున్న రేవంత్ ఇప్పుడు రాజీనామా ఆస్త్రాన్ని బయటకు తీసినట్టుగా అర్థం అవుతోంది.ఈ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం ఎలా రియాక్ట్ అవుతుందో ?







