భారతీయ రైల్వేలు దినదినాభివృద్ధి చెందుతున్నాయి.ఇప్పటికే దేశంలో పలు ప్రాంతాల్లో బుల్లెట్ ట్రైన్లను ప్రవేశపెట్టారు.
ఇవి చాలా వేగంగా ప్రయాణిస్తున్నాయి.ప్రయాణ సమయాన్ని 50 శాతం తగ్గించేశాయి.
ఈ తరుణంలో రైల్వే స్టేషన్లలో మౌలిక సదుపాయాలను పెంపొందించడానికి, ప్రయాణీకుల అనుభవాన్ని, ప్రయాణ సౌకర్యాన్ని మెరుగుపర్చడానికి పెద్ద మార్పులకు లోనవుతున్నాయి.రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రస్తుతం ఉన్న మౌలిక సదుపాయాల ఆధునీకరణపై బడ్జెట్ ప్రసంగంలో స్పష్టం చేశారు.
రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చినట్లు వెల్లడించారు.రైల్వేస్టేషన్ల అభివృద్ధి కోసం అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్‌ను తీసుకొచ్చినట్లు తెలిపారు.

రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేసేందుకు, వాటి రూపురేఖలు మార్చేందుకు అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద దేశవ్యాప్తంగా 1,275 రైల్వే స్టేషన్లను మౌలిక సదుపాయాలను మెరుగు పర్చనున్నారు.స్టేషన్ అప్‌గ్రేడేషన్ పనులు సాధారణంగా ప్లాన్ హెడ్-53 కస్టమర్ సౌకర్యాల క్రింద అమలు చేయబడతాయి.రైల్వే జోన్ల వారీగా స్టేషన్ల అభివృద్ధి మరియు నిర్వహణకు నిధుల కేటాయింపు జరుగుతుంది.ఇక ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోనూ పలు రైల్వే స్టేషన్లలో అభివృద్ధి పనులను చేపట్టనున్నారు.
తెలంగాణలో 39 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయనున్నారు.ఈ జాబితాలో సికింద్రాబాద్, కాజీపేట జంక్షన్, లింగంపల్లి, హైదరాబాద్, హైటెక్ సిటీ, భద్రాచలం రోడ్, ఖమ్మం, కరీంనగర్, కామారెడ్డి తదితర స్టేషన్లు ఉన్నాయి.
ఏపీలో 72 స్టేషన్లను ఈ పథకంలో భాగంగా అభివృద్ధి చేయనున్నారు.విజయవాడ, విశాఖపట్నం, అనకాపల్లి, దువ్వాడ, రాజమండ్రి, అనపర్తి, ఆదోని, అనంతపురం, తాడేపల్లిగూడెం, నెల్లూరు, విజయనగరం, తెనాలి, పార్వతీపురం, బొబ్బిలి టౌన్, అరకు, కొత్తవలస, తుని, నరసారావుపేట తదితర స్టేషన్లు ఈ జాబితాలో ఉన్నాయి.
ఈ పథకంలో భాగంగా రైల్వే స్టేషన్లలో ఆహ్లాదకర వాతావరణం పెంచేలా నిర్మాణాలు చేపడతారు.అవసరమైతే స్టేషన్లలో ట్రాక్‌ల సంఖ్యను కూడా పెంచుతారు.
లైటింగ్ వ్యవస్థ, డిజిటల్ బోర్డులు అమర్చుతారు.దివ్యాంగులకు, వృద్ధులకు అనువుగా సౌకర్యాలు మెరుగుపరుస్తారు.