ఈ రోజుల్లో ఆన్‌లైన్ వేదికగా సెకండ్ హ్యాండ్ కార్లు అమ్మే సంస్థలు బాగా పెరిగిపోయాయి.అయితే ఈ వాహనాల క్రయవిక్రయాల ప్రక్రియలో చాలా సమస్యలు ఎదురవుతున్నాయి.
కొత్త ఓనర్లకు వాహన బదిలీ, థర్డ్-పార్టీ డ్యామేజ్ బాధ్యతల విషయాల్లో ఫిర్యాదులు పెరుగుతున్నాయి.అయితే ఈ సమస్యలు వాహనదారులకు ఎదురుకాకుండా ఉండేందుకు కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది.
సెంట్రల్ మోటర్ వెహికల్ రూల్స్ యాక్ట్-1989లో సవరణలు చేసి అన్ని ప్రక్రియలు పూర్తి పారదర్శకంగా ఉండేలా చర్యలు చేపడుతోంది.ప్రీ-ఓన్డ్ కార్ల మార్కెట్‌లో ఏ సమస్యలు రాకుండా పూర్తి నియంత్రణను సృష్టించాలని కృషి చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.
ఈ ముసాయిదా నిబంధనల ప్రకారం, వాడేసిన కార్లను అమ్మే డీలర్లు రాష్ట్ర రవాణా అథారిటీ నుంచి ఆథరైజేషన్ సర్టిఫికేట్ తప్పక తీసుకోవాల్సి ఉంటుంది.అలాగే కార్ల యాజమాన్యాన్ని వారి పేర్లకు ట్రాన్స్‌ఫర్ చేయడం తప్పనిసరి.
కారు కొనుగోలు ప్రక్రియ మొత్తం డీలర్ ద్వారా జరగాల్సి ఉంటుంది.అసలు యజమాని, కొత్త కొనుగోలుదారు మధ్య ఎలాంటి కాంటాక్ట్ లేకుండా ఉండాలి.
ఒక డీలర్ అనేవాడు తమ వద్ద వాహనాన్ని కొనుగోలు చేసిన వారి వివరాలను రాష్ట్ర రవాణా కార్యాలయంలో సబ్మిట్ చేయాల్సిన బాధ్యత వహించాల్సి ఉంటుంది.

పైన చెప్పిన ముసాయిదా నియమాలు చూస్తుంటే.కార్ల యాజమాన్య బాధ్యతలు కస్టమర్‌కు ట్రాన్స్‌ఫర్ చేయడం నుంచి అన్ని బాధ్యతలు డీలర్ మాత్రమే వహించాల్సి ఉంటుంది.అంతేకాదు, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు, ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు, డూప్లికేట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు, యాజమాన్యం బదిలీ కోసం నో-అబ్జెక్షన్ సర్టిఫికేట్‌ల విషయంలోనూ డీలర్లు అన్ని బాధ్యతలు తమ భుజాలపై మోయాలి.
డీలర్లు ఒక వాహనానికి సంబంధించిన అన్ని వివరాలను చెక్ చేసి వాటినన్నిటినీ కొనుగోలుదారులకు అందుబాటులో ఉంచాలి.త్వరలోనే తీసుకురానున్న కొత్త నిబంధనలతో సెకండ్ హ్యాండ్ కార్ల కొనుగోలు ప్రక్రియ మరింత సులభతరం అవుతుంది.







