తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇప్పుడు దేశవ్యాప్తంగా కేసీఆర్ పెట్టబోయే కొత్త జాతీయ పార్టీ గురించి విస్తృతస్థాయిలో చర్చ జరుగుతోంది.తెలంగాణలో 2018 ఎన్నికలకు ముందు కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ ప్రయత్నాలు చేయగా ముందుకు సాగలేదు.
మళ్లీ ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కేసీఆర్ మరోసారి జాతీయ రాజకీయాలపై మక్కువ చూపిస్తున్నారు.ఇటీవల పార్టీ నేతలతో సమావేశమై టీఆర్ఎస్ పార్టీని జాతీయ పార్టీగా మార్చే వ్యూహాలపై చర్చలు జరిపారు.
మరోవైపు ప్రశాంత్ కిషోర్, ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి రాజకీయ విశ్లేషకుల సలహాలు కూడా తీసుకున్నారు.త్వరలోనే జాతీయ పార్టీని ప్రకటించేందుకు గులాబీ బాస్ ప్రణాళికలు రచిస్తున్నారు.
అయితే టీఆర్ఎస్ పార్టీకి జాతీయంగా ఎదిగేంత సీన్ ఉందా లేదా అన్న విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.దేశం వరకు ఎందుకు.
ముందుగా పక్క తెలుగు రాష్ట్రం ఏపీలో టీఆర్ఎస్ పార్టీ ఎన్ని సీట్లు సాధించగలదు అన్నదానిపై చర్చ జరుగుతోంది.
అయితే ఏపీలోని నాలుగు జిల్లాలలో టీఆర్ఎస్ పార్టీకి పట్టు ఉందని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.
ఉత్తరాంధ్రలోని విశాఖ, విజయనగరం జిల్లాలతో పాటు తూర్పుగోదావరి జిల్లా, ప్రకాశం జిల్లాలలో కేసీఆర్‌కు అభిమానులు ఉన్నారని వివరిస్తున్నారు.కేసీఆర్ ఓసారి అమరావతికి వచ్చిన ఓ సందర్భంలో ఘనస్వాగతం లభించిన తీరు గురించి కూడా ప్రస్తావిస్తున్నారు.
అయితే సెటిలర్లు కేసీఆర్ పార్టీ విషయంలో ఎలా స్పందిస్తారో అంటూ పలువురు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.కేసీఆర్ తలపెట్టిన మూడో కూటమికే సహకరించని దేశంలోని ప్రాంతీయ పార్టీల ముఖ్యమంత్రులు, పార్టీల అధినేతలు ఆయన రూపుదిద్దుతున్న జాతీయ పార్టీకి సహకరిస్తారా అన్నది కూడా ఆసక్తికరంగానే మారింది.
జాతీయ పార్టీ హోదాను పొందాలంటే వేర్వేరు ప్రాంతాల్లో ఎన్నికల్లో పోటీ చేశాక పోలైన ఓట్లలో కనీస స్థాయిలో ఓట్లు రావాలి.జాతీయ పార్టీ అంటే కనీసం ఓ నాలుగు రాష్ట్రాలలో అయినా సత్తా చాటాలి.అయితే ఇప్పటికిప్పుడు వచ్చే ఎన్నికల్లో సీట్లు సంపాదించడం అంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు.జాతీయ పార్టీని ప్రకటించాక కేసీఆర్ వేగంగా తన పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లకపోతే 2024 సార్వత్రిక ఎన్నికల్లో బొక్కబోర్లా పడటం ఖాయంగా కనిపిస్తోంది.