ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి బహిరంగ లేఖ రాశారు.ఇందులో భాగంగా తన భర్తపై అక్రమ కేసు బనాయించి అరెస్ట్ చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్నో ఏళ్లుగా నిస్వార్థంగా ప్రజల కోసం పనిచేసిన వ్యక్తిని ఇబ్బందులు పెడుతున్నారని వాపోయారు.ఈ ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబుకు అండగా నిలవాలని ఆమె లేఖలో విన్నవించారు.
అయితే స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే విజయవాడలోని ఏసీబీ కోర్టు ఆయనకు రిమాండ్ విధించింది.
అదేవిధంగా స్కాం కేసులో మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు గానూ చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలన్న సీఐడీ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం రెండు రోజుల పాటు కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే.ఈ మేరకు చంద్రబాబును రేపు, ఎల్లుండి సీఐడీ అధికారులు రాజమండ్రి సెంట్రల్ జైలులో ప్రశ్నించనున్నారు.
ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో నారా భువనేశ్వరి ప్రజలను ఉద్దేశించి రాసిన లేఖ చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు.ఇందులో తనకు కష్టం వచ్చిందనో, నష్టం కలిగిందనో ఈ లేఖను రాయడం లేదన్న భువనేశ్వరి నిస్వార్థంగా ప్రజలకు సేవ చేసిన తన భర్త చంద్రబాబుపై వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడిందని తెలిపారు.
ఇటువంటి ఘటనలు రాష్ట్రంలోని వ్యవస్థలకు సైతం శ్రేయస్కరం కాదని ఆమె పేర్కొన్నారు.ప్రజలంటే పిచ్చి ప్రేమతో రాష్ట్రాభివృద్ధి, భావితరాలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించాలనే తపనతో దశాబ్దాలుగా నిద్రాహారాలు మాని పని చేస్తున్న వ్యక్తి చంద్రబాబన్న ఆమె చంద్రబాబుకు ఇచ్చే బహుమానం జైలు శిక్షనా అని ప్రశ్నించారు.
దాదాపు 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ప్రభుత్వంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా చంద్రబాబు ఎప్పుడూ ప్రజల మధ్యనే ఉన్నారని చెప్పారు.ఆయన కర్మయోగి.
గెలుపు ఓటమిలో ఆయన కార్యదక్షతని, కార్యదీక్షని సడలించలేవన్నారు.కుట్రలు, కుతంత్రాలు ఆయన లక్ష్యాన్ని మార్చలేవని, తప్పుడు కేసులు అక్రమ అరెస్ట్ లు కోట్లాది ప్రజల నుంచి ఆయనను దూరం చేయలేవని చెప్పారు.
నిజాయితీకి నిలువెత్తు రూపమైనా తన భర్త చంద్రబాబు కోసం కోట్లాది అభిమానులు తల్లడిల్లుతున్నారని తెలిపారు.ఈ సమయంలో ప్రజల మద్దతు తమకు కొండంత బలమని పేర్కొన్నారు.
ప్రజలే చంద్రబాబుకు దేవుళ్లని, రాష్ట్రమే ఆయన ఇల్లన్న భువనేశ్వరి జనం కోసం పుట్టి వారి కోసమే బ్రతుకున్న ఆయనను కాపాడుకోవాల్సిన బాధ్యత జనం పైనే ఉందని వెల్లడించారు.తెలుగు వారందరూ అన్నగారు అని ఆప్యాయంగా పిలుచుకునే ఎన్టీఆర్ కుమార్తెను, విజనరీ లీడర్ గా ప్రపంచ ప్రముఖుల ప్రశంసలు అందుకున్న నారా చంద్రబాబునాయుడు భార్యని, విదేశాలలో ఉన్నత విద్యాభ్యాసం చేసి వరల్డ్ బ్యాంకులో కొలువులు వదులుకొని తాత, తండ్రి బాటలో ప్రజాసేవకై అడుగులు వేసిన యువ గళం నారా లోకేష్ తల్లినని చెప్పారు.
తన తండ్రి ముఖ్యమంత్రి, భర్త ముఖ్యమంత్రి, కొడుకు మంత్రిగా చేశారన్న భువనేశ్వరి ఈ ముగ్గురి హాయంలో తాను కానీ, తన కుటుంబ సభ్యులలో ఏ ఒక్కరు సొంతానికి ప్రభుత్వాన్ని, అధికారాన్ని వాడుకోలేదని చెప్పారు.
దశాబ్దాలుగా చంద్రబాబు ఆశా, శ్వాస ప్రజలేనని నారా భువనేశ్వరి లేఖలో పేర్కొన్నారు.
దేశ రక్షణ కోసం చాలామంది తమ పిల్లలని పంపిస్తారన్న ఆమె తాను రాష్ట్ర రక్షణకి, ప్రజాసేవకి తన భర్త, కొడుకుని త్యాగం చేశానని స్పష్టం చేశారు.తాను రాజకీయాలకు దూరంగా ఉంటూ చేతనైన సేవలు ప్రజలకు అందిస్తున్నా అని తెలిపారు.
ప్రకృతి విపత్తుల సమయంలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు ద్వారా సహాయం చేయడంతో పాటు ఎన్టీఆర్ మోడల్ స్కూల్ ద్వారా వేలాది మంది నిరుపేదలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దామన్నారు.బ్లడ్ బ్యాంకు ద్వారా ప్రతిరోజు వేలాది ప్రాణాలను నిలుపుతున్నాం.
తన సోదరుడు బాలకృష్ణ నిర్మించిన బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా రోగులకి పునర్జన్మ ప్రసాదిస్తున్నామని తెలిపారు.
ఎవరికి రూపాయి ఖర్చు లేకుండా ట్రస్టు ద్వారా తమ సొంత నిధులతో ఇన్ని సేవలు అందిస్తున్న తాము అవినీతికి పాల్పడుతామా.? అని ప్రశ్నించారు.తన భర్తను అక్రమంగా అరెస్ట్ చేయించారని, అంతేకాకుండా తన కొడుకు పై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
ఈ విషయాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు తెలియనివి కావు.కానీ చంద్రబాబు లాంటి అరుదైన ప్రజాసేవకున్ని కాపాడుకోవాలని చెప్పారు.ప్రజల భవిష్యత్తు కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన దార్శినికుడు, ప్రజాస్వామ్య ప్రేమికుడు చంద్రబాబుకు ప్రతి ఒక్కరూ అండగా నిలబడాలని భువనేశ్వరి లేఖలో విన్నవించారు.